తవ్వకాల్లో బయటపడ్డ 300ఏళ్ల నాటి రహస్య గది.. లోపల ఏముందో చూసి షాకైన పరిశోధకులు..
భూమి కింద మనకు తెలియని అనేక విషయాలు దాగివున్నాయి. వాటి గురించిన అవశేషాలు ప్రతిరోజూ ఏదో ఒక చోట బయటపడుతూనే ఉంటాయి. పురావస్తు శాఖ బృందం ఎప్పుడూ అలాంటి వాటి కోసం వెతుకుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే భూమిలో తవ్వకాలు జరుపుతుండగా దొరికిన ఒక రహస్య గది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 300 సంవత్సరాలుగా మూసివుంచిన రహస్య గదిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని లోపల దృశ్యాన్ని చూసి వారు మరింత షాక్ తిన్నారు. ఇంతకీ ఆ రహస్య గదిలో ఏముంది..? పరిశోధకులు అక్కడ ఏం చూశారో పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉక్రెయిన్‌లోని చారిత్రాత్మక గలిషియన్ కోటలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం 300 సంవత్సరాలుగా పాతిపెట్టి ఉంచిన రహస్యాన్ని వెల్లడించింది. ఈ కోటలో శాస్త్రవేత్తల బృందం ఒక రహస్యాన్ని కనుగొంది. వందల ఏళ్లుగా తెరుచుకోని ఆ పురాతన గదిలో ఏముంది.? అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పురావస్తు శాస్త్రవేత్తలు ఎంతగానో కష్టపడి ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. ఎట్టకేలకు వారు ఆ మిస్టిరీయస్ గదికి చేరుకున్నారు. ఈ ఆవిష్కరణ చరిత్ర పుటలకు కొత్త రంగులు వేస్తోంది. ఈ గది ఆయుధాలను ఉంచడానికి, ఫిరంగులను కాల్చడానికి నిర్మించబడిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
పశ్చిమ ఉక్రెయిన్‌లోని హాలిచ్ నగరంలో నిర్మించిన గలీషియన్ కోట (స్టారాస్టా కోట అని కూడా పిలుస్తారు) 12 నుండి 17వ శతాబ్దం వరకు ఎంతో ప్రసిద్ది చెందినదిగా పరిశోధకులు చెబుతున్నారు. డ్నీస్టర్ నది ఒడ్డున నిర్మించిన ఈ కోటకు అద్భుతమైన చరిత్ర ఉంది. గతంలో ఇది చెక్క కోటగా ఉండేది. కానీ 14వ శతాబ్దంలో రాజు కాసిమిర్ III దీనిని ఎంతో ధృడంగా నిర్మించాడు. 17వ శతాబ్దంలో ఆర్కిటెక్ట్ ఫ్రాన్సిస్కో కొరాజిని దీనిని పునరుద్ధరించాడు. కానీ, 1676లో టర్కిష్-పోలిష్ యుద్ధంలో టర్కిష్ సైన్యం ఫిరంగులతో దాడి చేసింది. ఇది కోటను దెబ్బతీసింది. బహుశా ఈ రహస్య గది అదే దాడిలో ఖననం చేయబడి ఉండవచ్చు. శతాబ్దాలుగా దాని గురించి ఎవరికీ తెలియదని పరిశోధకులు వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కోటలోని ఒక టవర్ శిథిలాలలో వెంటిలేషన్ షాఫ్ట్‌ను చూశారు. ఈ గొట్టం చాలా ఇరుకైనదిగా ఉంది. దాని లోపలికి వెళ్లడం అసాధ్యం. అయినప్పటికీ వారు 5,200 క్యూబిక్ అడుగుల శిథిలాలను చేతితో తొలగించారు. సున్నితమైన కళాఖండాలు, కోట నిర్మాణం దెబ్బతినకుండా ఉండటానికి వారు ఎటువంటి యంత్రాలను ఉపయోగించలేదని పురాతన గలిచ్ నేషనల్ రిజర్వ్ డైరెక్టర్ వ్లాదిమిర్ ఒలెనిక్ హెరిటేజ్ డైలీతో అన్నారు. చివరకు వారు ఈ రహస్య గదికి చేరుకున్నారు.
గది లోపలికి చేరుకున్న పురావస్తు శాస్త్రవేత్తలు అది కేస్‌మేట్ అంటే ఆయుధాలు ఉంచిన లేదా ఫిరంగులను కాల్చిన స్ట్రాంగ్ రూమ్‌గా కనిపించిన ఆనవాళ్లను వారు గుర్తించారు. గోడలపై నల్లటి మచ్చలు ఉన్నాయి. అవి ఆ సమయంలో ఫిరంగి కాల్పుల నుండి వెలువడిన పొగ జాడలు కావచ్చు. వెంటిలేషన్ పైపు కూడా దీనికి రుజువు.. ఎందుకంటే కేస్‌మేట్‌లోని పొగను తొలగించడానికి అలాంటి పైపులను తయారు చేసి ఉంటారని భావించారు.
గలీషియన్ కోటను గతంలో రాజ నివాసంగా ఉపయోగించారు. కానీ యుద్ధ సమయంలో రక్షణ కోసం కూడా దీనిని సిద్ధం చేశారు. ఈ రహస్య గది ఆవిష్కరణ కోట ఎంత వ్యూహాత్మకంగా ఉందో చూపిస్తుంది. కోటలోని మిగిలిన భాగాలతో ఇది ఎలా అనుసంధానించబడిందో అర్థం చేసుకోవడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు గదిలో దొరికిన వస్తువులను అధ్యయనం చేస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు గది గోడలో ఒక చిన్న సోరంగాన్ని కూడా గుర్తించారు. ఇది మరింత రహస్య మార్గాలకు దారితీస్తుందని భావిస్తున్నారు. ఈ కోటలో రహస్య భూగర్భ మార్గాలు ఉన్నాయని, గలీషియన్ కోట ఈ ఆవిష్కరణ చరిత్ర పుటలలో ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయని రుజువు చేస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




