
మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ తన చతురతతో, సమయస్ఫూర్తితో ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేవాడు. క్లిష్టమైన కేసులను కూడా నిమిషాల్లో ఛేదించడంలో బీర్బల్ దిట్ట. అటువంటి ఒక ఆసక్తికరమైన కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకసారి వర్షకాలంలో భారీ వర్షాల వల్ల యమునా నది ఉధృతంగా ప్రవహించి పొంగిపొర్లింది. నది తీరాన ఉన్న అక్బర్ భవనంలోకి రాత్రి వేళ నది ప్రవాహ శబ్దం చాలా గట్టిగా వినిపించసాగింది. ఆ సన్నాటంలో అక్బర్‌కు ఆ హోరు నది ఏడుస్తున్నట్లుగా అనిపించి, నిద్ర పట్టలేదు. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఆలోచించినా ప్రశాంతత లభించలేదు. ఆ మరుసటి రోజు ఉదయం దర్బార్ సమావేశమవ్వగానే అక్బర్ సభికులను ఉద్దేశించి, రాత్రి యమునా నది తీవ్రంగా ఏడుస్తోంది. మీలో ఎవరైనా నదికి వచ్చిన కష్టమేమిటో చెప్పగలరా? అని ప్రశ్నించాడు. ఆ విచిత్రమైన ప్రశ్నకు సభికులంతా తెల్లబోయి, సమాధానం తోచక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మిన్నకుండిపోయారు.
అప్పుడు బీర్బల్ ముందుకు వచ్చి, మహారాజా! ఆ శబ్దాన్ని నేను స్వయంగా వింటే కానీ కారణం చెప్పలేను అని విన్నవించాడు. దాంతో అక్బర్ ఆ రాత్రికి బీర్బల్‌ను అంతఃపురానికి ఆహ్వానించాడు. రాత్రి వేళ అక్బర్ గదిలోని కిటికీ వద్ద నిలబడి నది హోరును శ్రద్ధగా విన్న బీర్బల్‌కు అంతరార్థం అర్థమైంది. మరుసటి రోజు సభలో బీర్బల్ ఎంతో భావోద్వేగంతో విశ్లేషించాడు.
మహారాజా! యమునా నది తన పుట్టిల్లయిన హిమాలయ పర్వతాలను వదిలి, తన అత్తవారిల్లయిన సముద్రం వైపు ప్రయాణిస్తోంది. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రిని, పుట్టింటిని విడిచి వెళ్లాల్సి వస్తోందన్న దిగులుతో, వియోగ బాధను తట్టుకోలేక ఏడుస్తోంది అని చెప్పాడు.
బీర్బల్ ఇచ్చిన ఈ సమాధానానికి సభికులంతా ఊపిరి పీల్చుకోగా, అక్బర్ బాద్‌షా అతని అంతరార్థాన్ని, సృజనాత్మకతను ఎంతో మెచ్చుకున్నాడు.