ఈజీగా డబ్బు సంపాదించాలి..దానికోసం ఎలాంటి పనికైన వెనుకాడరు దొంగలు. గుడి బడి అనే తేడా లేదు. అవకాశం దొరికితే చాలు, అదునుచూసి చేతివాటం ప్రదర్శిస్తారు. అందినకాడికి దొచుకుని ఉడాయించేస్తారు. అది దేవుడి సొమ్మా, ప్రజల సొమ్మా అనే దానితో సంబంధం లేదు. దోచుకోవాలి అంతే.. చాలా ప్రదేశాల్లో సరైన రక్షణ లేని ఆలయాల్లో హూండీలు చోరీకు గురవుతూ ఉంటాయి. తాజాగా చెన్నైలోని రాణి పేట జిల్లాలో జరిగిన ఓ చోరీ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అక్కడ చోరీ చేసిన దొంగ ఏం చేశాడంటే..
చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ ఆలయంలో ఈ నెల 17వ తేదీన అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన అజ్ఞాత వ్యక్తి హుండీ పగల గొట్టి నగదు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఈ క్రమంలోనే కొద్ది రోజుల తరువాత హుండీలో నగదు లెక్కించే కార్యక్రమం తలపెట్టారు ఆలయ నిర్వాహకులు. జూన్ 22 మంగళవారం రోజున హుండీని ఓపెన్ చేయగా అందులో ఓ లేఖ లభించింది. అది ఆ గుడిలో చోరీకి పాల్పడిన దొంగ రాసిన లేఖగా గుర్తించారు అధికారులు. ఆ లేఖలో ఏముందంటే…
“నన్ను క్షమించండి. నేను చిత్ర పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హుండి పగలగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకపోగా.. కుటుంబంలోనూ సమస్యలు తలెత్తాయి. నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. నన్ను క్షమించండి. దేవుడు కూడా క్షమిస్తాడు. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు జతచేసి ఉంది.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది. ఇదంతా ఆ దేవుడి మహిమగా చెబుతున్నారు అక్కడి స్థానికులు, నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి