AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మట్టిలో మెరిసిన అదృష్టం.. రాత్రికి రాత్రే మారిపోయిన కూలీల బతుకులు.. ఈ కథ తెలిస్తే..

కష్టపడితే అదృష్టం తలుపు తడుతుందంటారు.. కానీ ఆ ఏడుగురు కూలీల విషయంలో అదృష్టం ఏకంగా వర్షం రూపంలో కురిసింది. ప్రతిరోజూ రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబాల జీవితాలను ఒకే ఒక్క రాత్రిలో మలుపు తిప్పింది ఓ అరుదైన వజ్రం. మట్టిలో మెరిసిన ఆ వజ్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మట్టిలో మెరిసిన అదృష్టం.. రాత్రికి రాత్రే మారిపోయిన కూలీల బతుకులు.. ఈ కథ తెలిస్తే..
7 Labourers Find Diamond In Panna
Krishna S
|

Updated on: Aug 13, 2026 | 6:40 PM

Share

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ మైనింగ్ గనిలో పని చేస్తున్న కూలీల జీవితం ఒక్కరాత్రిలోనే ఊహించని మలుపు తిరిగింది. దశాబ్దాలుగా పేదరికంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబాల్లో ఓ అరుదైన వజ్రం సరికొత్త వెలుగులు నింపింది. సర్కోహా గ్రామంలోని గనిలో వీరికి ఏకంగా 17.96 క్యారెట్ల మెరుపులు ఈనే అరుదైన డైమండ్ లభ్యమైంది. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం ఈ వజ్రం విలువ రూ.50 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నిర్వహించే వేలంలో దీని తుది ధర నిర్ణయం కానుంది. పన్నా జిల్లాలోని సర్కోహా గ్రామంలో కౌలుకు తీసుకున్న ఒక గనిలో ఏడుగురు కూలీలు కలిసి పనులు చేస్తున్నారు. ఆ రోజు వర్షం పడుతున్న సమయంలో మైన్‌ను తనిఖీ చేస్తుండగా, మట్టి దిబ్బల్లో ఏదో వింతగా మెరుస్తుండటాన్ని లీజుదారుడు అఖిలేష్ పాల్ గమనించాడు. దగ్గరకు వెళ్లి మట్టిని శుభ్రం చేసి చూడగా, అది సాధారణ రాయి కాదని, ఒక భారీ వజ్రమని తేలింది. దీంతో ఆ ఏడుగురు కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వార్త క్షణాల్లో వ్యాపించడంతో, గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రజలు ఆ అరుదైన వజ్రాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రభుత్వం వేలం.. డబ్బులు సమానంగా పంపకం..

అధికారిక నిబంధనల ప్రకారం.. లభించిన 17.96 క్యారెట్ల వజ్రాన్ని పన్నాలోని ప్రభుత్వ డైమండ్ ఆఫీసులో భద్రపరిచారు. అవసరమైన పరిపాలనా, న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత దీనికి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. వేలంలో వచ్చే మొత్తం సొమ్ము నుంచి ప్రభుత్వం తన రాయల్టీని మినహాయించుకుంటుంది. రాయల్టీ పోగా మిగిలిన పూర్తి మొత్తాన్ని గనిలో రక్తాన్ని చెమటగా మార్చిన ఆ ఏడుగురు కూలీలకు సమానంగా పంచి ఇస్తారు.

మూడేళ్ల కలలు.. ఏడుగురి భవిష్యత్ ప్రణాళికలు..

ఈ వజ్రం దొరకడం వల్ల ఆ ఏడుగురి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ముఖ్యంగా 30 నుండి 38 ఏళ్ల వయస్సున్న సంతోష్, శర్మన్, అరుణ్ అనే ముగ్గురు కార్మికులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పటివరకు వివాహం కాలేదు. వేలంలో వచ్చే డబ్బులతో త్వరలోనే పెళ్లిళ్లు చేసుకుని, సొంతింటి కల నెరవేర్చుకుంటామని వారు ఆనందంతో చెబుతున్నారు. మిగతావారు కూడా తమ కష్టాలకు స్వస్తి పలికి భవిష్యత్తును దిద్దుకోవాలని ప్లాన్ చేస్తున్నారు:

ప్రస్తుతం ఉన్న తాత్కాలిక రేకుల ఇళ్లను తొలగించి, కుటుంబం కోసం పక్కా ఇళ్లు నిర్మించుకోవాలని భావిస్తున్నారు. తమ పిల్లలు తమలా కూలీలుగా మారకూడదని, వారికి మంచి పాఠశాలల్లో నాణ్యమైన చదువు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేస్తున్నారు. సంవత్సరాలుగా తాము పడిన కష్టానికి, ఐక్యతతో చేసిన శ్రమకు దేవుడు ఇచ్చిన గొప్ప వరమని ఆ ఏడుగురు మిత్రులు ఆనందబాష్పాలతో తెలిపారు.

Follow Us