
మీ ఇంట్లో ఉన్న నీటి ట్యాంక్‌ను ఎంతకాలానికి ఒకసారి శుభ్రం చేస్తారు? చాలామంది నెలల తరబడి ట్యాంక్ క్లీనింగ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ అలాంటి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో రాజస్థాన్‌లోని కోటా నగరంలో జరిగిన ఘటన మరోసారి గుర్తు చేసింది. ఓ ఇంటి నీటి ట్యాంక్‌లో ఏకంగా 10 పాములు బయటపడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కోటా నగరంలోని ఆంవ్లీ రోజ్డీ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ ఇంట్లో నేలమట్టంలో నిర్మించిన నీటి ట్యాంక్ ఉంది. ట్యాంక్‌లో నీరు తక్కువగా ఉండటంతో శుభ్రం చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ సమయంలో నీటిలో ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో టార్చ్ వెలుగులో పరిశీలించగా ఒక్కటి కాదు.. రెండు కాదు.. భారీ సంఖ్యలో పాములు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రాకీ డేనియల్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. సుమారు 8×10 అడుగుల పరిమాణంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దిగి ఒక్కో పామును జాగ్రత్తగా పట్టుకుని ప్లాస్టిక్ బాక్స్‌లో భద్రపరిచాడు. అనంతరం వాటిని చంబల్ నదిలో సురక్షితంగా వదిలిపెట్టాడు. పట్టుబడినవి అన్నీ పిల్ల పాములు అనీ రాకీ డేనియల్ వెల్లడించాడు. ఒక్కోటి సుమారు అడుగు పొడవు ఉండగా, పెద్ద పాము మాత్రం కనిపించలేదని తెలిపాడు. ఇవి “చెకర్డ్ కీల్‌బ్యాక్” జాతికి చెందిన వాటర్ స్నేక్స్ అని వివరించాడు. సాధారణంగా మురుగు, బురద ప్రాంతాలు, నీటి నిల్వల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తాయని చెప్పాడు. ఈ పాములు విషపూరితమైనవి కాకపోయినా పూర్తిగా ఇబ్బంది ఉండదని భావించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం అనిపిస్తే ఇవి కాటు వేయవచ్చు. ముఖ్యంగా వీటి నోటిలో ఉండే బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పామును సాధారణంగా డెండూ అని పిలుస్తారుట. ఘటన తర్వాత కుటుంబ సభ్యులు తీవ్ర భయానికి గురయ్యారు. ట్యాంక్ పూర్తిగా నీటితో నిండిపోయి ఉంటే పాములు బయటకు వచ్చి ఇంట్లోకి చేరే ప్రమాదం కూడా ఉండేదని రాజ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశాడు.
నిపుణుల సూచనలు ప్రకారం.. ఇంటి నీటి ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలి. ట్యాంక్ మూత ఎప్పుడూ బిగించి ఉంచాలి. చుట్టుపక్కల చెత్త, బురద నిల్వ కాకుండా చూసుకోవాలి. నీటిలో ఏదైనా కదలిక కనిపిస్తే వెంటనే పరిశీలించాలి. పాములు కనిపిస్తే స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా నిపుణులకు సమాచారం ఇవ్వాలి.