సుమ కనకాల
బుల్లితెరపై ఇప్పుడున్న టాప్ యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల. కేరళ అమ్మాయి అయినా తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ.. తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సుమ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉండడం వల్ల ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు వచ్చింది. టీవీల్లో రియాల్టీ షోస్, సినిమాల ఈవెంట్స్ చేస్తూ ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలోను మాట్లాడగలదు. స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్స్ పూర్తి చేసినందుకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి పేరు ఎక్కింది. యాంకరింగ్ చేయకముందు ఆమె మేఘమాల సీరియల్లో నటించింది. అదే సమయంలో నటుడు రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి వివాహం 1999లో జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో హీరోగా వెండితెర అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. సుమ అటు సినిమాల్లో కీలకపాత్రలు కూడా పోషించింది.