కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. 59 ఏళ్ల కొండా సురేఖ.. గతంలో బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు. కొండా సురేఖ 1995లో కాంగ్రెస్ తరఫున వంచనగిరి ఎంపీటీసీగా గెలిచి.. గీసుగొండ మండల ఎంపీపీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో 1999 అసెంబ్లీ ఎన్నికల్లో శాయంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా ఆమె శాసనసభలో అడుగుపెట్టారు. 2004లో శాయంపేట శాసనసభ్యురాలిగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పరకాల నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్‌ను చేయకపోవడానికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చడాన్ని నిరసిస్తూ 2011 జూలై 4న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం పరకాల బైపోల్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర నినాదంతో విభేదించి 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేశారు. 2014 ఎన్నికల్లో తూర్పు వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవిని పొందారు.