YS Sharmila: పార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైయస్ షర్మిల కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై పదునైన మాటలు వదులుతున్నారు. అణిచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుందన్నారు. ప్రశ్నించే వారు ఎవరూ ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేశావ్ అంటూ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పోరాటం ద్వారా తిరిగి తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఒక్కటైన ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన…సంఘాలకు మద్ధతుగా తాము నిలుస్తామన్నారు. ” అణిచివేత ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుంది … ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు .. ప్రశ్నించే వారు ఎవరు ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేశావ్ .. పోరాటం ద్వారానే తిరిగి మా సమస్యలు పరిష్కారమౌతాయని ఒక్కటైన RTC ఉద్యోగుల పక్షాన .. సంఘాలకు మద్దతుగా మేము నిలబడుతాం.” అంటూ ఇవాళ గళమెత్తారు షర్మిల. టీఎస్ఆర్టీసీ సంఘాలు మళ్లీ ఒక్కటవుతున్నాయంటూ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పొందుపరుస్తూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, తెలంగాణలో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన షర్మిల.. ఈ నెల 24న కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. కరీంనగర్ లో కరోనా తో మరణించిన బాధిత కుటుంబలని పరామర్శించనున్నారు షర్మిల. తెలంగాణ లోని అన్ని జిల్లాలో ఒక్కో అంశంపై పర్యటన చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న ఆమె, ఆ దిశగా వడివడిగా కార్యాచరణ మొదలుపెడుతున్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఇప్పటికే షర్మిల కేసీఆర్ ఇలాకాలో పర్యటించారు.
ఇలా ఉండగా, జూలై 8న పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నామని వైయస్ షర్మిల ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామన్న ఆమె, కార్యకర్తలే రేపటి ప్రజానాయకులని చెప్పారు. వైయస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలి.. వారి వివరాలు, కష్టాలు తెలుసుకోవాలని షర్మిల పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.
జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇటీవల ఆమె బంజారాహిల్స్ లోటస్ పాండ్ ఆఫీస్ లో సన్నాహాక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జూలై 8న అత్యంత ఘనంగా కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన, ఈ సదర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లు, నిర్వహణ తదితర విషయాలపై ఈ సన్నాహాక సమావేశంలో చర్చించారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ప్రకటించారు.