తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల దూకుడు.. ఏప్రిల్ 9న పార్టీ పేరు ప్రకటించే అవకాశం..!

వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడును కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

  • Balaraju Goud
  • Publish Date - 6:07 pm, Mon, 1 March 21
తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల దూకుడు.. ఏప్రిల్ 9న పార్టీ పేరు ప్రకటించే అవకాశం..!

YS Sharmila Party : తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ప్రకటించిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో పలు దఫాలుగా షర్మిల చర్చలు జరిపారు. ఈ మేరకు పార్టీ క్యాడర్ సమాయత్తంపై, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం వేదికగా పార్టీని ప్రకటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తన పార్టీకి దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పేరుతోనే పార్టీని పెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్‌ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలించారు. మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో వైఎస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అలాగే, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు చేపట్టిను.. మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లతోనూ ఆమె భేటీ అయ్యారు. వారందరి నుంచి పార్టీ ఏర్పాటుపై అభిప్రాయాలను తీసుకుంటున్నారు.ఈ సందర్బంగా వైఎస్‌ కుటుంబానికి అండగా నిలవాలన్న నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.

మరోవైపు పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ తెరవెనక ముమ్మరంగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించి తొలి నియామకం చేపట్టారు. తన కార్యక్రమాల సమన్వకర్తగా వాడుక రాజగోపాల్‌ను షర్మిల నియమించారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గానికి చెందిన రాజగోపాల్ వైఎస్ కుటుంబానికి 30 ఏళ్లుగా పరిచయం ఉంది. అటు వైఎస్సార్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు.

ఇదిలావుంటే, తాము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చెప్పాలి. రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు ప్రస్తుతం ఎలాంటి కష్టాలు పడుతున్నారు. వాటిని ఎలా తీర్చాలి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి ?. అసలు పార్టీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇలాంటి అంశాలపై షర్మిల ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. జనంలోకి వెళ్లాక వారడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా షర్మిల ఫ్రిపేర్ అయ్యినట్లు సమాచారం.

అంతేకాదు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై షర్మిల అభిప్రాయాలు సేకరించారు. అధికారంలో ఉన్న కేసీఆర్, టీఆర్ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపైన కూడా షర్మిల చర్చించినట్లు తెలుస్తోంది.

ఇక, తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత కేఎస్ దయానంద్.. షర్మిల మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌‌గా ఉన్న ఆయన తన పదవికి, టీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం షర్మిలతో సమావేశమై.. ఆమె మద్దతు ప్రకటించానని కేఎస్ దయానంద్ చెప్పారు. ఇలా పార్టీ ప్రకటన తర్వాత అధికార పార్టీతో సహా వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలందరు తమవైపు వచ్చే అవకాశముందని షర్మిల అభిమానులు భావిస్తున్నారు.

Read Also … BJP MLA Raja Singh Turned As Hero: బయోపిక్‌లో హీరోగా నటిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..