– శ్రావణి , టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
YS Sharmila New Party in Telangana: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాబోయే జయంతి జులై 8న కొత్త పార్టీని ఆవిష్కరించేందుకు వైఎస్ షర్మిల సన్నాహాలు మొదలు పెట్టారు. అదే రోజున పార్టీ పేరును, జెండా, అజెండాను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక వైపు పార్టీ ఆవిర్భావ వేడుకకు సిద్ధం అవుతూనే జెండా అజెండా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.
తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఒక్కటొక్కటిగా పూర్తి చేసుకుంటున్నారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి సమయం దగ్గరపడుతుండంతో.. దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే.. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద పేరు రిజిస్టర్ చేయించనున్నారు. మరో వారం రోజుల్లో ఈ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే షర్మిల పార్టీ ఆవిర్భావ వేడుకకు వేదిక, ముహూర్తం ఖరారు అయ్యాయి. జులై 8న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా తమ కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు షర్మిల. అదేరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇడుపులపాయలో తండ్రకి నివాళి అర్పించి నేరుగా హైదరాబాద్ వచ్చి పార్టీ అవిష్కరణలో పాల్గొనబోతున్నారు షర్మిల.
ఇదంతా ఒకవైపు అయితే వైఎస్‌ఆర్‌టీపీ జెండా ఖరారు అయినట్లు సమాచారం. ఏపీలో అధికారంలో ఉన్న తన అన్న వైఎస్ జగన్ నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే జెండా.. అజెండా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదు. వైఎస్సార్సీపీ జెండాను పోలిన విధంగా మూడు రంగుల్లో తమ పార్టీ పతాకానికి రూపకల్ప చేస్తున్నారామె. ఇన్ని రోజులు లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లు అనేక రంగుల్లో కనిపించేవి. కానీ, ఈరోజు వైఎస్ఎస్ఆర్ డిజిటల్ మీట్ లో మాత్రం అన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు ఒకేలా ఉన్నాయి.. పాలపిట్ట, బ్లూ, లేత ఆకుపచ్చ రంగుల్లోనే లోటస్ పాండ్ ప్రాంతం అంతా ఫ్లెక్సీలతో నింపేశారు పార్టీ కార్యకర్తలు. ఇప్పటికే పార్టీ జెండాపై ముఖ్యులతో చర్చించిన షర్మిల.. పార్టీ జెండా దాదాపుగా ఖరారు చేసేసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌టీపీ జెండాలో ప్రాధాన్యత ..80% పాలపిట్టా రంగు.. 20% లేత ఆకుపచ్చ కలర్ తో మధ్యలో తెలంగాణ మ్యాప్ అందులో తల పాగా లేకుండా దివంగత నేత వైఎస్ఆర్ బొమ్మ.. ఇలా జెండాని ఫైనల్ చేసినట్లు సమాచారం.
వైఎస్ షర్మిల పార్టీ పార్టీ విధి విధానాలు కూడా దాదాపు వైసీపీని పోలి ఉండొచ్చనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో మెజారిటీ ప్రజలను ఆకర్షించేలా ఉన్న వైసీపీ విధానాలను తెలంగాణలోనూ అమలు చేసేలా నిర్ణయాలను తీసుకుంటారని భావిస్తున్నారు. సామాజిక, ఆర్థికపరంగా ఏపీ, తెలంగాణ మధ్య కొంత వ్యత్యాసం ఉన్నందున.. దానికి అనుగుణంగా, క్షేత్రస్థాయి పరిస్థితులు, వాస్తవాలను ప్రతిబింబించేలా పార్టీ విధి విధానాలను ఖరారు చేస్తారని సమాచారం. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించేలా, విధి విధానాలు ఉంటాయని తెలుస్తోంది.