ఏ తల్లికయినా తన పిల్లలు అంటే ప్రేమే ఉంటుంది. వారి జీవితం మొత్తం పిల్లల కోసమే.. వారు ఏదయినా తప్పు చేస్తే.. కోపంతో తిడుతారు.. మళ్ళీ ప్రేమతో అక్కున చేర్చుకుంటారు.. కానీ, ఇక్కడ తన తల్లి తిట్టిందని తప్పుగా అర్థం చేసుకొని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు.. ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి కోపంతో మందలించిందని మనస్తాపానికి గురైన బాలుడు.. సెల్ఫీ వీడియో తీసుకొని స్నేహితులకు పంపి, అడవిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొనరావుపేట మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన రాజు, జ్యోతి దంపతుల కుమారుడు దినేష్(17). దినేష్ ఏదో తప్పు చేయగా.. తల్లి మందలించింది. అయితే, తల్లి తనను మందలించడాన్ని తట్టుకోలేకపోయిన దినేష్.. అడవిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చీకటి పడినా కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు ఊరంతా గాలించారు. ఊరు చివర అడవిలోనూ గాలించగా.. ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది. బోరున విలపించారు. ‘అయ్యో కొడుకా ఎంత పని చేస్తివిరా బిడ్డా నీకోసమేరా మేము పడరాన్ని కష్టాలు పడుతున్నం. ఎంత పని చేస్తేవిరా కొడకా’ అంటూ అడవంతా వినిపించేలా ఆ తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అడవిలో బాలుడి మృతదేహం లభ్యం కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..