Yellow Colour Frogs: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కప్పల సందడి మొదలవుతుంది. చెరువులు, కాల్వలు వంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ఎక్కడ ఏ చిన్న నీటి నిల్వ గుంటలు ఉన్నా.. అక్కడ కప్పలు బెకబెకలతో సందడి చేస్తాయి.. అయితే మహబూబాబాద్ జిల్లాలో (mahabubabad district) అరుదైన పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి. మరిపెడ మండలం ఎల్లంపేట ష్టేజి తండాలో పసుపు రంగు కప్పలు కనిపించాయి. వర్షాలు కురవడంతో వర్షపు నీటిలో ఈ పసుపు రంగు కప్పలు చేరాయి. అయితే ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడకపోవడంతో స్థానికులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. అయితే, ఈ పసుపు రంగు కప్పలను చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. నిజానికి ఇవి సాధారణ కప్పలే. వీటిని బుల్‌ఫ్రాగ్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు.
ఖాకీ, ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉండే ఈ కప్పలు సడెన్‌గా ముదురు పసుపురంగులో మారతాయి. ఇలా పసుపు రంగులో మారేవన్నీ మగ కప్పలేనట. ఆడ కప్పలను ఆకర్షించడానికి రంగును మార్చుకుంటాయట. ఈ విషయం తెలియక ఈ కప్పలను చూసి స్థానికులు భయపడుతుంటారు.
అయితే, టెర్రిబిల్లిస్ కప్పలు కూడా పసుపు వర్ణంలోనే ఉంటాయి. కొలంబియా అడవుల్లో కనిపించే ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్స్ అని కూడా పిలుస్తారు. ఈ కప్పలే ఇప్పుడు మన దేశంలో కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదంటున్నారు నిపుణులు. గడిచిన కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాకాలం ప్రారంభంలో ఈ కప్పలు కనిపించాయి. గతంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనూ పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..