Yadagirigutta: గుడి వద్ద పోలీసులును చూసి కారు వదిలేసి పరార్.. డిక్కీ ఓపెన్ చేసి చూడగా
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఇంటి దొంగలు పడ్డారు. స్వామి వారి సన్నిధిలో పనిచేస్తూనే స్వామి వారికే శఠగోపం పెట్టబోయారు. అయితే ఆ ఇంటి దొంగలు ఏం చేశారు..? ఎలా పట్టుబడ్డారు..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాష్ట్రంలో తెలంగాణ తిరుపతిగా పేరుందిన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రజల ఇలవేల్పుగా వెలుగుందుతున్నాడు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా.. శని, ఆదివారం, సెలవు దినాల్లో 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు.
లడ్డు, పులిహోర, దద్దోజనం, చెక్కర పొంగళి, బెల్లం పొంగళి, క్షీరాన్నం, కేసరిబాత్, సిరా, కీర్, జిలేబి, లడ్డూ, వడ, కారా బూంది, దోశ, శొండెలు, బజ్జీలు, చక్క శీతలం, వడపప్పు, కట్టె పొంగళి వంటి బోగాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న భక్తులు లడ్డు, పులిహోరలను మహా ప్రసాదంగా భావిస్తుంటారు. ఈ ప్రసాదాలను ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తుంటారు.
శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉద్యోగులతోపాటు మరికొందరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పని చేస్తున్నారు. స్వామి వారి సన్నిధిలో పనిచేసే మధు, గణేష్ అనే ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ప్రసాదాలకు వినియోగించే పదార్థాలపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మధు గణేష్‌లు కన్నేశారు. స్వామి వారి నైవేద్యం, ప్రసాదాలకు వినియోగించే పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేశారు. ఇంకేముంది.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కారులో కొండపైకి వచ్చి స్వామి వారి పోటు శాలకు పక్కన ఉండే స్టోరేజీ వద్దకు చేరుకున్నారు. కొండపైన ప్రసాద తయారీ కేంద్రం నుండి చింతపండు బస్తాల చోరీకి యత్నించారు. కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తెచ్చి కారులో తరలించేందుకు సిద్ధమయ్యారు.
అదే సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులను చూసి కారు, చింతపండు బస్తాలను వదిలేసి పారిపోయారు. కారులోని 10 చింత పండు బస్తాలను స్వాధీనం చేసుకున్న ఎస్పీఎఫ్ పోలీసులు పారిపోతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మధు, గణేష్‌లను పట్టుకున్నారు. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చింతపండు బస్తాలను దొంగిలించే సమయంలో రికార్డు కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాల వైర్లను తొలగించారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని, ఈ చేతివాటం వెనుక మిగిలిన ఆలయ ఉద్యోగుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో శాఖపరమైన విచారణ కూడా నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగాయా, రాత్రిపూట ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొండపైకి ఎలా వచ్చారు..? ఎస్పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
