
విద్య ద్వారానే సమాజాభివృద్ధి చెందుతుందని నమ్మాడు ఆ అధికారి. వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించి.. గరిటే చేత పట్టి విద్యార్థులకు భోజనం వడ్డించారు ఆ జిల్లా పాలనాధికారి. భావి భారత పౌరులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని ఆ అధికారి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి చెందుతుందని నమ్మిన ఆయన విద్యాశాఖపై దృష్టిని సారించారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే.. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే పనిలో పడ్డారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నారు. చదువుల్లో విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మేలుకొలుపు అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేపట్టారు.
ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రభుత్వ హాస్టళ్ళను ఆకస్మిక తనిఖీ చేస్తూ ఆహార మెనూ పరిశీలిస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించని ఉపాధ్యాయులు, సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు కూడా వేశారు. తాజాగా భువనగిరి పట్టణంలోని కేజీబీవీ స్కూల్, కాలేజీ హాస్టల్ ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు అందించే కర్రీస్, భోజనాన్ని ఆయన పరిశీలించారు.
మెనూ ప్రకారం టమాట, గుడ్డు కర్రీ చేయాలి కదా, ఎందుకు చేయలేదని ఎస్‌వోని ప్రశ్నించారు. అడిగితే గుడ్లు టెండర్ తీసుకున్న వ్యక్తి సరఫరా చేయడం లేదని తెలిపారు. దీంతో సంబంధిత టెండర్‌దారుడికి ఫోన్ చేసిన కలెక్టర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలో వసతి సౌకర్యాలు, నాణ్యమైన ఆహారంపై ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో విద్య బోధన, పౌష్టికాహారంపై ఆయన ఆరా తీశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు ఆయన సూచించారు. తల్లితండ్రులు, గురువులకు, జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన అన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..