Telangana: మాటల్లో పెట్టి.. మాయం.. ముక్కుపుడక కోసం వచ్చి ఏం చేశారో వీడియోలో చూడండి..

ముక్కుపుడక కావాలంటూ వచ్చారు.. వందల రూపాయల వస్తువు కొనేందుకు వచ్చినట్లే నటించి ఏకంగా రూ.10 లక్షల బంగారు నగల బాక్సునే లేపేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని జ్యువెలరీ షాపులో నలుగురు కిలాడీ లేడీస్ వేసిన పక్కా స్కెచ్ ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana: మాటల్లో పెట్టి.. మాయం.. ముక్కుపుడక కోసం వచ్చి ఏం చేశారో వీడియోలో చూడండి..
Zaheerabad Jewellery Theft

Edited By:

Updated on: Aug 18, 2026 | 1:43 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది. ముక్కుపుడక కొనుగోలు చేస్తామంటూ నగల దుకాణంలోకి ప్రవేశించిన నలుగురు మహిళల ముఠా.. అత్యంత చాకచక్యంగా చేతివాటం ప్రదర్శించి ఏకంగా రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఈ ఘరానా మోసం దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. జహీరాబాద్ పట్టణంలోని ప్రముఖ జై భవాని జ్యువెలరీ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16న సుమారు 4 గంటల సమయంలో బురఖాలు ధరించిన నలుగురు మహిళలతో పాటు ఓ యువకుడు దుకాణంలోకి వచ్చారు. తమకు ముక్కుపుడకలు కావాలని అడగడంతో, షాపు యజమానితో పాటు సేల్స్‌మెన్ వివిధ డిజైన్లను వారికి చూపించడంలో నిమగ్నమయ్యారు. వారందరినీ మాటల్లో పెట్టి దృష్టి మళ్లించిన క్రమంలో.. ముఠాలోని ఓ మహిళ ఎవరికీ అనుమానం రాకుండా కౌంటర్‌పై ఉన్న బంగారు నగల బాక్సును కాజేసింది. నగల బాక్సు చేతికి చిక్కగానే ఏమీ తెలియనట్లుగా నటించిన ఆ మహిళలు, “డిజైన్లు ఏవీ నచ్చలేదు” అని చెబుతూ ఆ యువకుడితో కలిసి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

ఆలస్యంగా గుర్తించి.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

వారు వెళ్లిన కాసేపటికి కౌంటర్‌పై ఉన్న నగల బాక్సు కనిపించకపోవడంతో దుకాణ యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ముక్కుపుడకల కోసం వచ్చిన మహిళలే చాకచక్యంగా నగల బాక్సును తస్కరించిన దృశ్యాలు బయటపడ్డాయి. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 10 లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ నలుగురు మహిళలు, యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us