
పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు ఆ గ్రామ మహిళలు. యువత మద్యానికి బానిసలై అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ఇక చాలు.. మద్యం వద్దు – ప్రాణం ముద్దు అంటూ పోరాట బాట పట్టారు. మెదక్ జిల్లా మక్కారాజుపేటలో మహిళలు చేపట్టిన ఈ వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశమైంది. చేగుంట మండలం మక్కారాజుపేటలో బెల్ట్ షాపుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా సంఘాలన్నీ ఏకమయ్యాయి. గురువారం విద్యార్థులతో కలిసి గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, బెల్ట్ షాపు నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామాన్ని మద్యం రహితంగా మార్చడానికి మహిళా సంఘాలు కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇది అమ్మేవారికి షాకిస్తోంది. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే రూ. 50,000 జరిమానా విధిస్తారు. అటు తాగేవారికి గట్టి హెచ్చరిక కూడా. మద్యం కొనుగోలు చేసి తాగిన వారికి రూ. 10,000 జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు.. ఈ నిబంధనలతో కూడిన హెచ్చరిక బోర్డులను మహిళలే స్వయంగా ప్రతి షాపు ముందు అతికించి అందరికీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ర్యాలీ అనంతరం మహిళలు ఆగలేదు. స్థానిక దాబా హోటళ్లపై మెరుపు దాడులు చేశారు. అక్కడ తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన మాంసం, నిల్వ ఉంచిన గుడ్లు, కల్తీ ఆహార పదార్థాలను చూసి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మక్కారాజుపేటను పూర్తిగా మద్యపాన రహిత గ్రామంగా మార్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. మహిళల ఈ సాహసోపేతమైన ముందడుగుకు గ్రామస్తుల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..