
Women fighting for seat: తెలంగాణ ఆర్టీసీ బస్సులో మళ్లీ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు మహిళలు.. మొన్న క్రిస్మస్ రోజున భద్రాచలం బస్సులో ఇద్దరు మహిళలు కొట్టుకోగా.. తాజాగా వరంగల్ బస్సులో మరో ఇద్దరు సిగపట్లు పట్టుకున్నారు. వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ చెలరేగింది. మాటల యుద్ధం శ్రుతిమించి సిగపట్లకు చేరుకుంది. ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. ఒకరికొకరు జుట్లు పట్టుకుని వీరంగం సృష్టించారు. వీళ్లిద్దరి మధ్య గొడవను చూసి.. మిగతా ప్రయాణికులంతా ముక్కున వేలేసుకున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కిటకిటలాడుతున్నారు. అందరూ ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో.. కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో వరంగల్ నుండి నర్సంపేట వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. తాను ఆపుకున్న సీట్లో కూర్చున్నారంటూ ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు. మాట మాట పెరిగి తన్నుకునే వరకు వెళ్లింది. చిరవకు కండక్టర్, డ్రైవర్ సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
కాగా.. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండం కలకలం రేపుతోంది. ఇప్పటికే రద్దీని నివారించేందుకు ప్రభుత్వం.. కొత్త ఆర్టీసీ బస్సులను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. మరికొన్ని రోజుల్లో కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..