
హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. సైదాబాద్‌లో ఓ వివాహిత తన భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సైదాబాద్‌కు చెందిన అయేషా ప్రవీన్ తన భర్త గిషాన్‌ను నిద్ర మాత్రలు కలిపిన మద్యం తాగించి.. అతను మత్తులోకి జారుకున్నాక కర్రతో దాడి చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గిషాన్ (45) పూల వ్యాపారం చేసేవాడు. గత కొన్ని నెలలుగా అయేషా, గిషాన్ మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. అయేషా తన భర్తపై గృహహింస కేసు పెట్టగా.. గిషాన్ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు.
కాగా జూన్ 11న రాత్రి గిషాన్ ఇంటికి వచ్చిన తర్వాత.. అయేషా అతనికి మద్యంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అతడు సోయి కోల్పోయిన తర్వాత కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అయితే జరిగిన ఘటనకు భయపడి గిషాన్‌ను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ చికిత్స పొందుతూ గిషాన్ మరణించాడు.
గిషాన్ సోదరుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జూన్ 13న అయేషాపై భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేశారు. గిషాన్ మృతికి కారణమైన గాయాలపై పూర్తి నిర్ధారణ కోసం పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మొన్నీమధ్య భర్తను హనీమూన్‌కి తీసుకెళ్లింది సోనమ్.. ఇప్పుడు మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి భర్తను లేపేసింది ఈవిడ. దీంతో అమ్మో పెళ్లంటే భయంగా ఉందని నెట్టింట కామెంట్స్ పేలుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..