Telangana: కాంగ్రెస్‌లో కల్లోలం కొలిక్కి వచ్చేనా.. దిగ్విజయ్ మాట సీనియర్లు వింటారా..

|

Dec 23, 2022 | 10:37 AM

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో.. తెలంగాణలో హస్తం పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై సీనియర్లు ఆగ్రహంతో ఉండటంతో.. అధిష్టానం దిద్దుబాటు చర్యలు..

Telangana: కాంగ్రెస్‌లో కల్లోలం కొలిక్కి వచ్చేనా.. దిగ్విజయ్ మాట సీనియర్లు వింటారా..
Digvijay Singh
Follow us on

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో.. తెలంగాణలో హస్తం పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిపై సీనియర్లు ఆగ్రహంతో ఉండటంతో.. అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దీంతో కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ సీఏం దిగ్విజయ్‌ సింగ్‌ను రంగంలోకి దింపింది. బుధవారం హైదరాబాద్‌ చేరుకున్న ఆయన గురువారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో బిజిబిజీగా గడిపారు. నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా దిగ్విజయ్ సింగ్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారు. కొందరు నాయకులతో చర్చల తర్వాత.. ఆయన అధిష్టానానికి ఓ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి పనితీరు, వ్యవహరశైలిపైనే దిగ్విజయ్ సింగ్‌కు నాయకులు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని.. ఈరోజు ఆయన ఢిల్లీ పయనమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో ముచ్చటించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలంపై దిగ్విజయ్ సింగ్‌ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చేతిలో గీతల మాదిరి ఉందనే విమర్శలు ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్‌ మధ్యవర్తిత్వంతో హస్తం పార్టీ నేతలు ఇప్పటి నుంచైనా కలసికట్టుగా పనిచేస్తారా.. లేదా అనే చర్చ కాంగ్రెస్ కార్యకర్తల్లో సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో పరిణామాలను చక్కదిద్దేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్.. పీఏసీ కమిటీ సభ్యులతో పాటు సేవ్ కాంగ్రెస్ నేతలు, రాజీనామా చేసిన వాళ్లతో పాటు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వాళ్ల నుంచి వచ్చిన అభ్యర్ధనలు, వాదనలేంటి, వాటికి దిగ్విజయ్ చూపించే రాజీ ఫార్ములా ఏంటి అనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..