Itlu Mee Niyojakavargam: అలంపూర్‌లో పోటీకి సై అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు.. మూడుసార్లు గెలిచిన బీజేపీకి జై కొడుతారా..
జోగులాంబ సన్నిధిలో ఈసారి పొలిటికల్ జోరెవరిది? అలంపూర్‌లో అబ్రహం మళ్లీ గెలుస్తారా? ఎమ్మెల్యేగారి పనితీరు.. ప్రజలకు పసందేనా? శ్రీశైలం పశ్చిమ ద్వారంలో ప్రతిపక్షాల వ్యూహమేంటి? శక్తి పీఠంలో ప్రతిపక్షాలకు ఛాన్స్ దొరుకుతుందా?

అలంపూర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండి..రాయలసీమ ప్రాంతాన్ని తలపించే విధంగా ఉండే నియోజకవర్గం అది. తుంగభద్ర నదీ తీరాన ఉండి దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలంపూర్ నియోజకవర్గం రాజకీయంగా తనదైన శైలీలో ముద్ర వేసుకుంది. జిల్లాలోనే వెనుక బడిన ప్రాంతంగా ముద్రపడినా..అలంపూర్ నియోజకవర్గం ప్రతీ ఎన్నికల్లో ఇక్కడ ప్రజల తీర్పు చైతన్యవంతంగా ఉంటుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో.. ఇప్పుడిలాంటి చర్చే జరుగుతోంది. తుంగభద్ర నది ఒడ్డున ఉంటూ.. శ్రీశైలం పశ్చిమ ద్వారంగా ప్రసిద్ధికెక్కిన ఈ జోగులాంబ క్షేత్రంలో… రాజకీయం మరోసారి రసపట్టుగా మారింది. 18 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ పుణ్యక్షేత్రంలో.. ఈసారి పొలిటికల్ జోరెవరిదనే విషయంలో… రకరకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం మళ్లీ గెలుస్తారా? లేదా? ప్రతిపక్షాలకు ఈసారైనా చాన్స్ దక్కుతుందా? లేదా? అంటూ బోలెడన్ని ముచ్చట్లు గుసగుసలుగా గుప్పుమంటున్నాయి.
కాంగ్రెస్ 5సార్లు.. బీజేపీ 3సార్లు గెలుపు
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకుని… తెలంగాణలో ఉండే ఈ నియోజకవర్గంలో రాజకీయం బహు ప్రత్యేకమైంది. అలంపూర్,ఐజ,ఇటిక్యాల,వడ్డేపల్లి,మానోపాడు మండలాలు ఇక్కడ కీలకం. 1957 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఐదు సార్లు గెలిస్తే… బిజెపి మూడు సార్లు, టిడిపి రెండు సార్లు, ఇండిపెండెంట్ ఒక సారి, టిఆర్ఎస్ ఒక సారి.. విజయం సాధించాయి. ఉద్యమకాలం నుంచీ ప్రయత్నిస్తే… రాష్ట్ర ఏర్పాటు తర్వాత, అంటే 2018ఎన్నికల్లో కారుపార్టీని విజయం వరించింది. ఎస్సీ రిజర్వ్ స్థానమైన అలంపూర్‌లో… టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వి.ఎం. అబ్రహం గెలుపు ను సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిపై 44 వేల 679 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి.. ఒక రికార్డు సృష్టించారు. అయితే, మరోసారి ఆయనకు ప్రజలు అవకాశం ఇస్తారా? అంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంపత్ కుమార్ ఈసారైనా గెలిచేనా?
2009లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన అబ్రహం… ఆ తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిఎన్నికల్లో… కాంగ్రెస్ అభ్యర్థి సంతప్‌కుమార్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక, 2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి ఆయనను విజయం వరించింది. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సంపత్‌కుమార్… ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. సందు దొరికితే చాలు… ఎమ్మెల్యే ఇరుకునపెట్టేలా విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. మునుపటి కంటే ఈసారి కాంగ్రెస్‌లో జోష్ కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి… విజయావకశాల్ని మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు సంపత్.
మూడుసార్లు గెలిచిన బీజేపీ.. మళ్లీ పుంజుకుంటుందా?
బీజేపీ సైతం… ఈసారి అలంపూర్‌ను సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఇక్కడ మూడుసార్లు గెలిచిన ఆ పార్టీ… ఇప్పుడున్న వేవ్‌లో మళ్లోసారి ఈజీగా గెలవొచ్చన్న ధీమాతో ఉంది. ఈ స్థానంలో గెలుపు రుచి తెలిసిందే కాబట్టి… మరోసారి ఆ ఫ్లేవర్‌ను ఎంజాయ్ చేయాలన్న కసితో పనిచేస్తున్నారు లోకల్ నేతలు. అభ్యర్థి ఎవరనే విషయంలో క్లారిటీ రాకపోయినా.. క్యాడర్‌లో జోష్ తగ్గకుండా చూసుకుంటున్నారు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు.
అబ్రహం కుమారుడు అజయ్ బరిలో ఉంటారా?
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వీఎం అబ్రహం ఆలోచన మరోలా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కుమారుడు అజయ్‌ని ఈసారి బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినబడుతోంది. అందుకే, నియోజకవర్గ రాజకీయాల్లో అతణ్ని క్రియాశీలం చేశారనే ముచ్చట.. లోకల్‌గా షికారు చేస్తోంది. అంతేకాదు, పార్టీ కార్యక్ర మాల్లోనూ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు అబ్రహం కొడుకు. అయితే, ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం కోసం ఆశపడుతున్న వారికి.. ఈ వ్యవహారం ఇబ్బందిగా మారిందట. బట్ ఆశావహుల సందడి ఎక్కువగా కనిపిస్తుండటం.. అధికార పార్టీలో ఆందోళన పెంచుతోంది. అబ్రహం, ఆయన కుమారుడితో పాటు… మాజీ ఎంపీ మందా జగన్నాథ్, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీచైర్మన్ బండారు భాస్కర్‌తోపాటు మరికొందరు నేతలు… ఈ సీటును ఆశిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ అంతర్గత పోరుతో… ఎమ్మెల్యే అబ్రహమ్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్న ప్రచారమూ ఊపందుకుంది.
అభివృద్ధి ఓవైపు.. వెంటాడే సమస్యలు మరోవైపు..
రాజకీయాలు అట్టా ఉంటే… నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చ మరోలా నడుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న అలంపూర్.. ఇప్పుడిప్పుడే కాస్త డెవలప్‌మెంట్‌ను చూస్తున్నా… అదేస్థాయిలో సమస్యలూ వెంటాడుతున్నాయి.
ప్రసిద్ధి గాంచిన జోగులాంబ ఆలయం దగ్గర సౌకర్యాలలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది భక్తుల ప్రధాన ఆరోపణ. ఆలయంలో పందులు తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమంటున్నారు.
ఓవైపు అధికార పక్షం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశామలం చేశామని చెబుతుంటే.. విపక్షనేతల వెర్షన్ మరోలా ఉంది. ఆర్డీఎస్ కెన్సాల్ నిరూపయోగంగా ఉన్నాయన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. తుమ్మిళ్ల నుంచి కూడా… అరాకొర నీళ్లు మాత్రమే పారుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.
అలంపూర్‌లో అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థ!
అలంపూర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనిచేయకపోవడంతో… లోకల్ జనాల అవస్థలు అన్నీ ఇన్నీకావు. ఈ విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా ఫెయిలయ్యారంటోంది విపక్షం. అబ్రహం రాకముందు అలంపూర్ ఎలా ఉండేది?… ఇప్పుడెలా ఉంది? అంటే మాత్రం… పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందనేవారు ఎక్కువే ఉన్నారు. రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆర్డీఎస్ సప్లమెంటరీ తీసుకొచ్చి సాగునీరందించారనీ… 24, 25 డిస్ట్రిబ్యూటరీల దగ్గర, గతంలో అర ఫీట్ వాటర్ మాత్రమే నిల్వ ఉండేవనీ… ఇప్పుడు ఆరు ఫీట్ల వరకు నీళ్లు నిల్వ ఉండేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారనీ స్థానికంగా పలువురు అభిప్రాయపడ్డారు.
విద్య, వైద్యం, రవాణా విషయంలో… గతంతో పోలిస్తే అలంపూర్‌లో బెటర్మెంట్ ఉందన్నది ఎమ్మెల్యే మాట. అందులోనూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు కూడా అబ్రహమ్‌కు ఉండటం కలిసొచ్చే అంశం.
ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చానంటున్నారు ఎమ్మెల్యే అబ్రహం. అభివృద్ధికి తోడు కేసీఆర్ సంక్షేమ పథకాలు.. తన విజయానికి అదనపు బలంగా ఉపయోగపడతాయని ధీమాగా చెబుతున్నారు. మరిన్ని పనులు చేయాల్సి ఉందని… అందుకే మరోసారి గెలిచి వస్తానంటున్నారు.
ఎన్నికల ఏడాది వచ్చేయడంతో… అలంపూర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. క్రమక్రమంగా పొలిటికల్ ఈక్వెషన్స్ కూడా మారుతున్నాయి. ఎమ్మెల్యే ఎత్తుకున్న అభివృద్ధి మంత్రి.. సంక్షేమరాగం… వచ్చే ఎన్నికల్లో సహకరిస్తాయా? కాలం కలిసొచ్చి కాంగ్రెస్ గెలుస్తుందా? లేక బీజేపీ తన బలం చూపిస్తుందా? అన్నది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
