హైదరాబాద్, అక్టోబర్ 13: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌పై వేటు పడింది. దీంతో కొత్త బాస్ నియామకం అనివార్యంగా మారింది. ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానల్ లిస్ట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈసీకి పంపారు. ఈ ముగ్గురిలో ఒకరిని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఎంపిక చేస్తుందా? లేక మరికొన్ని పేర్లు పంపాల్సిందిగా కోరుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సాయంత్రానికి కొత్త సీపీ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ సీపీ పోస్టు కోసం అడిషనల్ డీజీ క్యాడరున్న ఆఫీసర్ల లిస్ట్ ఎన్నికల కమిషన్‌కు చేరింది. సందీప్ శాండిల్య, వీవీ శ్రీనివాస్ రావ్, శికా గోయల్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, మహేష్ భగవత్, శివధర్ రెడ్డి, సజ్జనార్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిలో ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి ఈసీకి పంపింది ప్రభుత్వం. సందీప్ శాండిల్యకు సౌత్ జోన్ డీసీపీ, సైబరాబాద్ సీపీ, రైల్వేస్ డీజీగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్ హోదాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘకాలంగా లూప్‌లైన్‌లోనే ఉన్నారు. ఇక ఖాళీ అయిన మరో పది ఎస్పీ పోస్టుల కోసం 30 మంది పేర్లను కూడా సిఫారసు చేసింది. ఎవరెవరి పేర్లు ఖరారవుతాయనే సస్పెన్స్‌తో డిపార్ట్‌మెంట్ మొత్తం గంభీరంగా మారింది. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ తీరు.. తెలంగాణా పోలీసుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఇదిలాఉంటే.. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పోలీస్ శాఖలో కలవరం రేపింది. హైదరాబాద్ సహా ముగ్గురు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు.. మొత్తంగా 13 మంది అధికారుల్ని బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ కమిషనర్ రంగనాథ్‌పై కూడా వేటు పడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్య మిగతా అధికారుల్ని కూడా అలర్ట్ చేసింది. ఈసీ ప్రకటన వచ్చిన వారం తిరగక ముందే ఇలా యాక్షన్ పార్ట్ మొదలవడంపై బ్యూరోక్రాట్లలో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. ఇక ఈసీ బదిలీ చేసిన అధికారులకు ఎన్నికలు ముగిసేవరకు అంటే.. దాదాపు రెండు నెలల పాటు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వడం కుదరదు. కెరీర్‌లో ఇదొక పెద్ద మరక లాంటిదే. అందుకే.. మలి జాబితాలో తమ పేరు రాకుండా, ఎటువంటి రిమార్క్ పడకుండా ఎవరికివారు జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే.. బదలీ అయిన 13 మంది అధికారుల స్థానంలో కొత్తగా ఎవరొస్తారు.. పోస్టింగ్ ఎవరికిస్తారు.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ కొత్వాల్ కుర్చీ ఎవరిని వరించనుంది.. ఈ ప్రశ్నలతోనే ఉడికిపోతోంది ఖాకీ శాఖ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..