కూతురి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించిన క్షణాల్లోనే తండ్రి మరణించిన దుర్ఘటన ఇటీవల వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన ఇంకా ప్రజలు మరువక ముందే, అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుక కాస్తా ..విషాదంగా మారింది. బిడ్డకు పెళ్లి చేసి మెట్టినింటికి సాగనంపే క్రమంలో ఆ తల్లి ఆనందంగా డ్యాన్స్ చేసింది. పెళ్లి బరాత్‌లో ఎంతో హుషారుగా డ్యాన్స్ చేసిన ఆ తల్లి అలాగే, కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆనందోత్సాహంలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. లింగాల మండలంలోని పద్మన్నపల్లి గ్రామానికి చెందిన మూడవత్ విజయలక్ష్మి తన కుమార్తె సంధ్యను అదే మండలానికి చెందిన యంసి తండాకు చెందిన యువకుడికి ఇచ్చి ఘనంగా వివాహం వేడుక జరిపించింది. పెళ్లి కూతురు సంధ్యను అత్తగారింటికి సాగనంపే కార్యక్రమంలో భాగంగా ఊరేగింపు నిర్వహించారు. కూతురి పెళ్లి బారాత్‌లో డ్యాన్స్(Dance)చేస్తుండగానే ఆ తల్లి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలింది. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు విజయలక్ష్మీని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతురాలు విజయలక్ష్మి గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.
కూతురి పెళ్లి బరాత్ లో తల్లి మృతిచెందడంతో బంధుమిత్రులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. బాజాభజంత్రీలు మూగబోయాయి. వధువు ఇంట్లో చావు డప్పులు మోగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలు విజయలక్ష్మికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని..కేవలం వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురైందని బంధు, మిత్రులు తెలిపారు. ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్ని ఎంతగానో కలచివేసింది.