Weather Warnings: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులు పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తూనే ఉంది. మరో రెండు , మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షములతో పాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తాయని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వెల్లడించింది. ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర కొనసాగిన అల్పపీడనం మంగళవారం కాస్త బలహీన పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ద్రోణి దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్రా మీద కొనసాగుతూ మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్ళే కొలదీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఒకటి, రెండు ప్రదేశాల్లో, ఎల్లుండి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రదేశములలో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
అయితే తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు ఉండగా.. 642 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తి 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండికుండలా మారింది. ఎగువన ఛత్తీస్‌గడ్.. తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి వరదనీరు జలాశయాల్లోకి చేరుతోంది.