రెండు రోజులపాటు కుండపోత వానలు.. ఆ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!

రెండు రాష్ట్రాల్లో వర్షాలు దంచుతున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం(ఆగస్టు 13) నుండి తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు 12 తేదీ నుండి 15 వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

రెండు రోజులపాటు కుండపోత వానలు.. ఆ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!
Telangana Rain Alert

Updated on: Aug 12, 2025 | 8:36 PM

రెండు రాష్ట్రాల్లో వర్షాలు దంచుతున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం(ఆగస్టు 13) నుండి తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆగస్టు 12 తేదీ నుండి 15 వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 72 గంటల పాటు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రెండు రాష్ట్రాల్లో వర్షాలు దంచుతున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఫుల్‌‌గా వానలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో సాయం కాలం నుంచి రాత్రంతా వానలు పడుతున్నాయి. దీనికి కారణం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడమే. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వానలు దంచికొడుతున్నాయి.

తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు.. భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల, కొమురంభీం, భూపాలపల్లి, ములుగులో భారీ వర్షాలు పడ్డాయి. పడబోతున్నాయి. హైదరాబాద్‌కు రెండు రోజుల పాటు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చారు అధికారులు.

వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గొల్ల బుద్ధారం పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. ఉపాధ్యాయులు, స్థానికులు కలిసి.. విద్యార్థులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఇళ్లకు తరలించారు. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

జోరు వర్షాలతో ఓరుగల్లు బేజారవుతోంది. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీట మునిగింది. రైలు పట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్లాట్‌ఫామ్‌ల అంచు దాకా నీళ్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వరంగల్‌లో పలు లోతట్టు కాలనీలు నీట మునిగాయి. అండర్‌ రైల్వే బ్రిడ్జి దగ్గర వరదలో పలు వాహనాలు చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కాలనీవాసులను అధికారులు ఆదేశించారు. వరద ముంపుతో GWMC సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరంగల్‌ సంతోషిమాతా కాలనీలో ఇళ్లలోకి రకరకాల పురుగులు చేరి స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తెలంగాణ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, పెద్దపల్లి, కరీంగనర్‌, మంచిర్యాల, జైశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొమురం భీం జిల్లాలకు భారీ వర్షం గండం పొంచి ఉంది.

ఇక భారీ వర్షంతో హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూసీ నదిపై ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తడంతో మూసారాంబాగ్‌ వంతెన మూసివేశారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్‎కు వరద నీరు పొటెత్తింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రిజర్వాయర్‌లోని ఐదు గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్‌ ఇన్‌ఫ్లో 1000, ఔట్‌ఫ్లో 4వేల 800 క్యూసెక్కులగా ఉంది.. మరోవైపు బండ్లగూడ ORRపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు.

హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున GHMC అన్ని విధాలా సిద్ధంగా ఉంది. బుధవారం నుంచి రెండు రోజులపాటు GHMC వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. జలమండలి, వాటర్ బోర్డు , హైడ్రా, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ తో పాటు పలు శాఖల సమన్వయంతో పని చేస్తున్నామన్నారు GHMC కమిషనర్‌ ఆర్వీ కర్ణన్. 269 వాటర్‌ లాగింగ్‌ పాయింట్స్‌ను గుర్తించామన్నారు కర్ణన్‌.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(S) మండలం ఏపూరు గ్రామ బ్రిడ్జి పై నుండి గుండ్ల సింగారం వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మండలం నల్ల చెరువు తండా వద్ద భారీ వర్షాలకు ఐదు 11 KV విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నల్ల చెరువు తండా నుండి, కుప్పిరెడ్డి గూడెం వెళ్లే దారిపై విద్యుత్ స్తంభాలు అడ్డంగా పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పస్ఫుల, బావాయిపల్లి మధ్య ఉదృతంగా ప్రవహిస్తోంది పస్ఫుల వాగు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల.. 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు రోజుల్లో మరింత బలపడనుంది అల్పపీడనం. అయా జిల్లాలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..