Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు..

|

Oct 07, 2022 | 6:47 PM

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు భారీగా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు..
Telangana Rain Alert
Follow us on

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం.. ఈరోజు తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉన్నట్లు వివరించారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

కాగా.. రెండు రోజుల నుంచి తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోని పరిగి, తాండూరు పట్టణాలు తల్లడిల్లుతున్నాయి. భారీ వర్షానికి కాగ్నా నది పొంగి పొర్లుతోంది. తాండూరు, వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడే అవకాశముందని.. తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు భారీగా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..