Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. దీంతో చలి గాలుల తీవ్రత(Cold Waves) పెరుగుతోందని వెల్లడించింది. రానున్న రెండు రోజులు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రి సమయాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.
తెలంగాణాలో కనిష్టానికి ఉష్ణోగ్రతలు:
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిపులి పంజా విసురుతుండడంతో ప్రజలు వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి టీ లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. బేలాలో, నిర్మల్ జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో చలి తీవ్రత:
ఆంధ్రాలోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. ముఖ్యంగా విశాఖ మన్యంలో చలి తీవ్రత రోజు రోజుకు అధికమౌతోంది. గత నాలుగు, ఐదు రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు వచ్చాయని, మంచు అధికంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకు , మినుములూరు, లంబసింగి తదితర ప్రాంతాల్లో కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యారు. చలి తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం నుంచి పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఎదురుగా ఏమున్నాయో తెలియని పరిస్థితి ఉందంటే.. మంచు ఏ విధంగా కురుస్తుందో అర్థం చేసుకోవచ్చు. చలికి తట్టుకొనేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.