Telangana MLC Elections: తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల సంఘం నేతలు గుర్రుగా ఉన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గత కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో వినతులు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఛాన్స్ దొరికినట్లయింది. ఇదే అదునుగా భావిస్తున్న నేతలు.. ప్రభుత్వం ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశారు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల సంఘం నేతలు.
ఈ నెల 15లోపు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ లకిడికపూల్ లోని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐక్య కార్యాచరణ సమావేశంలో రాష్ట్రంలోని ఎంపీటీసీలు,ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమకు నిధులు, విధులు కేటాయించకుండా.. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓట్లు వేయడానికి మాత్రమే తమను ఉపయోగించుకుంటున్నారని ఆ సంఘం నేత సత్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నికైన నాటి నుంచి నిధులు లేక, అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని అన్నారు. ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని వాపోయారు. ప్రతీ సంవత్సరం ఎంపీటీసీ లకు రూ. 50 లక్షల నిధులు ఇవ్వాలని, బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించే నిధుల కంటే అదనంగా రూ. 1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ఈ నెల 15వ తేదీ లోపు పరిష్కరించకపోతే.. 12 ఎమ్మెల్సీ స్థానాలకు తామే పోటీచేస్తామని ప్రకటించారు. తమ ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు తమ సమస్యలపై ఒక్కసారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also read:
Hyderabad Crime News: చికిత్స కోసం వెళ్లి.. ఆసుపత్రిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణం..