
ఇబ్రహీంపట్నం, నవంబర్ 2: ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఊహించలేం. నిత్యం అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వచ్చేది శీతాకాలం. ఈ కాలంలో వెచ్చదనం కోసం విష సర్పాలు జనావాసాల్లోకి వస్తుంటాయి. అందుకే ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. తాజాగా ఓ ఇంట్లోకి ఏకంగా కొండ చిలువ దూరేసింది. దీంతో ఊరుఊరంతా పరుగులు తీసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామ సమీపంలో ఉన్న వెంచర్లో గత కొంతకాలంగా సముద్రాల అంజయ్య, గొర్రెలను కాస్తు జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం యధావిధిగా వెంచర్లోకి వెళ్లాడు. అయితే అక్కడ ఒక గదిలో శబ్దం రావడంతో ఉడుము వచ్చిందేమోనని ఆ గదిలోకి వెళ్లి చూశాడు. అయితే అక్కడ ఉడుముకు బదులు 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దీంతో భయంతో బయటకు పరుగులు తీశాడు. గ్రామస్తులకు సమాచారం అందించడంతో.. గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రెండు గంటలపాటు శ్రమించి కొండ చిలువను ఒక సంచిలో బంధించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లివదిలిపెట్టడంతో గ్రామస్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.