వర్ష బీభత్సం.. వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు

|

Sep 01, 2024 | 11:12 AM

శనివారం రాత్రి బయల్దేరిన ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. రాయపర్తి మండలం మొరిపిరాల శివారులో జాతీయ రహదారిపై చెట్టు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం రాత్రి బయల్దేరిన ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఎటూచూసిన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా మొత్తం చీకటి అలుముకుంది. మరోవైపు, ముసురుతో పాటు, చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. చలిగాలి వీస్తుండటంతో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..