Warangal Road Accident : అతివేగం ప్రమాదకరమని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది డ్రైవర్లకు చెవికెక్కడం లేదు. నిర్లక్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 10 మంది స్పల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరకాల ఆర్టీసీ డిపో కు చెందిన బస్సుగా గుర్తించారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కాగా శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద ప్రమాదం జరిగింది. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కామారెడ్డి జిల్లాలో లారీ వెనక నుంచి ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. లారీ డ్రైవర్ అతి వేగమే రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోవడంతో లారీ వెనకవైపు చిక్కుకున్న మహిళను రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. అనంతరం లారీ డ్రైవర్ నేరుగా సదాశివనగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.