Political Heat In Warangal Live Updates: విరాళాల వివాదం… ఓరుగల్లులో ఉద్రిక్తత… బీజేపీ నేతల అరెస్టులు…

రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని, వాటి లెక్కలు చూపాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు

Political Heat In Warangal Live Updates: విరాళాల వివాదం... ఓరుగల్లులో ఉద్రిక్తత... బీజేపీ నేతల అరెస్టులు...

Edited By:

Updated on: Feb 01, 2021 | 1:43 PM

Political Heat In Warangal Live Updates: రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని, వాటి లెక్కలు చూపాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లులో రాజకీయ వేడిని రాజేశాయి. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు హన్మకొండలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. దీంతో అధికార పార్టీ నేతలు బీజేపీపై ఎదురుదాడికి దిగారు. హన్మకొండలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కాగా, బీజేపీ పార్టీ నేతలు ఛలో వరంగల్‌కు పిలుపునిచ్చారు. పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు ఘట్‌కేసర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Feb 2021 01:40 PM (IST)

    నోరు జారితే చట్టపరమైన చర్యలు…

    పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే లేచిన నోర్లు, రాముడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎందుకు మెదపటం లేదని వీహెచ్ పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ప్రశ్నించారు . రాముడి పేరు పెట్టుకున్నందుకైనా కేటీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పాలన్నారు. కేటీఆర్ రెచ్చగొట్టే ప్రకటన చూస్తుంటే రామ మందిరంపై ఎమ్మెల్యేల మాటలు టీఆర్ఎస్ విధానంగా భావించాల్సి వస్తుందన్నారు. హిందువుల విశ్వాసాలు గాయ పరచడంలో టీఆర్ఎస్ ఎంఐఎంతో పోటీ పడుతుందన్నారు. రామ కార్యానికి అడ్డుపడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యకలాపాలపై ఇకపై ఎవరైనా అనవసరంగా నోరు జారితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • 01 Feb 2021 01:32 PM (IST)

    పరకాలలో కొనసాగుతున్న బంద్….

    పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా పరకాల పట్టణ బంద్‌కు టీఆర్ఎస్ శ్రేణులు పిలుపునిచ్చారు. కాగా… పరకాలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


  • 01 Feb 2021 01:17 PM (IST)

    ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్…

     

    వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడిని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వెళుతున్న ఆయనను ఘట్ కేసర్ వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పోలీసు స్టేషన్ కు తరలించారు.

  • 01 Feb 2021 01:06 PM (IST)

    ఓరుగల్లుకు వెళ్తున్న నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు

    వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులకు మధ్య వార్ కొనసాగుతోంది. బీజేపీ పార్టీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఛలో ఓరుగల్లుకు పిలుపునిచ్చింది. దానిలో భాగంగా పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్‌కు బయలుదేరారు.  అయితే వారిని పోలీసులు మధ్యమార్గంలోనే అరెస్టు చేస్తున్నారు.  జనగామ వద్ద బీజేపీ నేతలు ఎండల లక్ష్మీనారాయణ, మాజీమంత్రి పెద్దిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • 01 Feb 2021 12:57 PM (IST)

    బీజేపీ నేతలను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉంది… కేటీఆర్…

    హన్మకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు చేసిన దాడిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతల తీరును ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏమాత్రం చోటు లేదన్నారు. తెలంగాణలో రాణించాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని బీజేపీ నేతలకు హితవు చెప్పారు. బీజేపీ నేతల భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్‌కు ఉందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే.. బీజేపీ నేతలు కనీసం బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుందని తీవ్ర స్వరంతో మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

  • 01 Feb 2021 12:55 PM (IST)

    ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేస్తారా..? ఖబడ్దార్… అన్న మంత్రి ఎర్రబెల్లి…

    అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. బీజేపీ నేతలు ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఇంటిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  బీజేపీ శ్రేణులు ప్రశాంతంగా ఉన్న నగరంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు.  గతంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిపై  బీజేపీ శ్రేణులు దాడి చేశారని అన్నారు. అంతేకాకుండా పరకాల సీఐపై సైతం బీజేపీ నేతలు దాడి చేశారని గుర్తు చేశారు.  ఇప్పుడు మరో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారని, బీజేపీ గుండాగిరికి పాల్పడుతోందని అన్నారు.

  • 01 Feb 2021 12:46 PM (IST)

    ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించిన అధికార పార్టీ నేతలు…

    ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాడికొండ రాజయ్య,  పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఖండించారు. బీజేపీ నేతలు గుండాగిరి చేస్తున్నారని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  దురుద్దేశం, రాజకీయ లబ్ధి కోసం దాడులకు దిగుతున్నారని అన్నారు.

  • 01 Feb 2021 12:38 PM (IST)

    బీజేపీ జిల్లా కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి…

    అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిదాడికి దిగారు. జనవరి 31న మధ్యాహ్నం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు రాళ్ల దాడి చేయగా… అదే రోజు రాత్రి(జనవరి 31(నిన్న)) టీఆర్ఎస్ శ్రేణులు హన్మకొండ హంటర్‌రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ పార్టీ కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి.

  • 01 Feb 2021 12:34 PM (IST)

    ట్రస్ట్ ద్వారా రామమందిర నిర్మాణం జరుగుతోంది…

    అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన విమర్శలపై జిల్లా బీజేపీ నేతలు స్పందించారు. రామ మందిర నిర్మాణం కోట్లాది మంది భారతీయుల కల అని. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన  ప్రత్యేక ట్రస్ట్ ద్వారా భవ రామ మందిర నిర్మాణం జరుగుతోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. అధికార పార్టీ నేతలు అహంకారంతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

  • 01 Feb 2021 12:26 PM (IST)

    ప్రశ్నిస్తే ఇంటిపై దాడి చేస్తారా..?

    తాను రామ భక్తుడినని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తన స్వగ్రామంలో రామాలయం నిర్మించానని తెలపారు. రాముడు తన ఇలవేల్పు అని తెలియజేశారు. అటువంటి తాను రాముడిపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. కేవలం రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ శ్రేణులు వసూలు చేస్తున్న చందాల లెక్కలు చూపమని ప్రశ్నించానని తెలిపారు. ప్రశ్నిస్తే తన ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేశారని అన్నారు.

  • 01 Feb 2021 12:17 PM (IST)

    తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న ఎమ్మెల్యే

    రాముడు అందరి దేవుడని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తాను రాముడిపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. కేవలం బీజేపీ శ్రేణులే చందాలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించానని, ఇప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేశారో లెక్క చెప్పాలని డిమాండ్ చేశానని స్పష్టం చేశారు. తాను మొదట చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

  • 01 Feb 2021 12:14 PM (IST)

    ఎమ్మెల్యే వ్యాఖ్యలతో దుమారం…

    పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీజేపీ శ్రేణులపై చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లులో రాజకీయ దుమారాన్ని రేపాయి. రామ మందిర నిర్మాణ నిధుల విషయంలో విమర్శలు చేసినందుకు ఆగ్రహించిన బీజేపీ నేతలు హన్మకొండలోని ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం చల్లా ఇంటిపై దాడికి దిగారు.  ఇంటి అద్దాలు పగలగొట్టారు. ఇంటిపైకి రాళ్లు విసిరారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసినా ప్రతిఫలం లేకుండా పోయింది. చివరకు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు.

  • 01 Feb 2021 12:09 PM (IST)

    పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అసలు ఏమన్నారంటే..?

    ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యుడు, అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మూడు రోజుల క్రితం రామ మందిర నిర్మాణ విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే…‘గ్రామాల్లో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారు. చందా పుస్తకాలు వారే కొట్టిస్తూ… ప్రజల దగ్గరి నుంచి పైసలు వసూలు చేస్తున్నారు. వాటికి లెక్కాపత్రం ఉండడం లేదు. బీజేపీ నేతలు రామ మందిర నిర్మాణ చందాల లెక్కలు చూపాలి’. అని వ్యాఖ్యానించారు.

  • 01 Feb 2021 12:03 PM (IST)

    ఓరుగల్లుకు కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం…

    టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడిని కమలం పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అధికార పార్టీ శ్రేణుల చర్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు హన్మకొండలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. కాగా… బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం వరంగల్ జిల్లాకు బయలుదేరింది. దీంతో ఓరుగల్లులో రాజకీయ వేడి మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

     

  • 01 Feb 2021 11:58 AM (IST)

    ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడికి నిరసనగా టీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో…

    ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పై దాడికి నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. పరకాల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై టైర్లు తగలబెట్టి రాకపోకలకు అంతరాయం కల్పించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.