వరంగల్, జనవరి 13; కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి.. సంక్రాంతి నుండి ఉగాది వరకు మూడునెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు.. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరగనుంది. లక్షల సంఖ్యలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు..ఎత్తు బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలతో కన్నుల పండువగా సాగే మల్లికార్జున స్వామీ జానపదుల జాతర విశేషాలేంటో చూసొద్దాం రండి…
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం ఒకటి.. మూడునెలల పాటు జరిగే మళ్ళనల్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది..
సంక్రాంతి తో మొదలై ఉగాది వరకు మూడు నెలలపాటు సందడిగా సాగే ఈ జానపదుల జాతర ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రత్యేకం.. ముచ్చటైన స్వగత తోరణాలతో రారామ్మనిపించే ఐనవోలు మల్లన్న ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది..
ప్రకృతి రమణీయతను అద్భుత శిల్ప సంపదతో సువిశాల ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది.. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్స వాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు , ఛత్తీస్గఢ్ సహా విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు..
ఈనెల 13వ తేదీన ఉత్సవాలు ప్రారంభమై 14న భోగి 15న మకర సంక్రాంతి ప్రభాబండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.. ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగిసిపోనున్నాయి..
సంక్రాంతితో మొదలయ్యి ఉగాదితో ముగిసే జానపదుల జాతర నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆదివాసి కుంభమేళా అయిన మేడారం జాతర ఉండడంతో భక్తులు అధిక మొత్తంలో వచ్చి స్వామివారికి మొక్కులు సమర్పించుకోనున్నారు.. బారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రెండు పర్యాయాలు ఐనవోలు జాతర ఏర్పాట్ల పై అధికారులకు దిశ నిర్దేశం చేశారు.. ప్రత్యేక నిధులు కేటాయించారు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ అదనపు క్యూ లైన్లు సహా సౌచాలయాలు, త్రాగునీరు,చలవ పందిళ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..