ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని, వాటి లెక్కలు చూపాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఎమ్మెల్యేకు, బీజేపీ శ్రేణులకు మధ్య వివాదానికి కారణమయ్యాయి. కాగా… హన్మకొండలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు జనవరి 31న మధ్యాహ్నం దాడికి దిగారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. అయితే తన ఇంటిపై దాడిని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఖండించారు. లెక్కలు అడిగితే ఇంటిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను రామ భక్తుడినేనని ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తన స్వగ్రామంలో రామాలయం నిర్మించానని ఎమ్మెల్యే తెలిపారు. తాను ఇప్పటికీ మొదట చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని అన్నారు. బీజేపీ శ్రేణులు పార్టీ కండువాలు కప్పుకొని చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.