Telangana: జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఓ దొంగల ముఠా కొత్త తరహా దోపిడీలకు శ్రీకారం చుట్టింది.. జైలు జీవితంలో దోస్తీ కట్టిన దొంగల ముఠా ఈసారి రూటు మార్చారు.. గొర్రెల దొంగతనంతో వరంగల్ ఉమ్మడి జిల్లా అంతట సంచలనం సృష్టించారు.. కానీ పాపం పండి మళ్లీ కటకటాల పాలయ్యారు.

Telangana: జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
Warangal Goats Theft Case

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 05, 2025 | 9:58 AM

వాళ్ళ వృత్తి దొంగతనాలు.. ఇళ్లల్లో దోపిడీలు చేసినా, బైక్ దొంగతలు చేసినా అట్టే పోలీసులకు పట్టుబడుతున్నారు. సీసీ కెమెరాలకు చిక్కి.. పోలీసులకు ఇట్టే దొరికిపోతున్నారు. ఇలా అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చారు.. ఈసారి రూట్ మార్చిన దొంగల ముఠా తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మీడియా ముందు హాజరు పరిచారు.. వీళ్ళంతా గొర్రెల దొంగతనాలతో చాలా గ్రామాల్లో కంటిమీద కునుకుండా లేకుండా చేశారు.. ఎట్టకేలకు ఈ ముఠా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. విచారణలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్దుంపురానికి చెందిన బాదవత్ సాయిచరణ్ అలియాస్ సిద్దు, వరంగల్ నగరానికి చెందిన యం.డి గౌస్ పాషా, కోట విశ్వతేజ, వర్ధన్నపేట మండలం ఇల్లందుకు చెందిన రాయపురం సాయి, అంగడి వెంకన్న పాత నేరస్తులు.. వీరంతా గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లిన వారే.. జైలు స్నేహంలో ఒక ముఠాగా మారారు.. గతంలో తాళం వేసిన ఇళ్లలో దోపిడీలు.. బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు.. కానీ ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరాల సాయంతో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళారు.

Warangal Sheep Theft Case

అయితే.. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కొత్త రూట్ ఎంచుకున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలను కారులో ఎత్తుకెళ్లి వాటిని వేరే ప్రాంతాలో అమ్ముకుని ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో గీసుకొండ పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు రావడంతో పోలీసులు పోకస్ పెట్టారు.. ఈ క్రమంలోనే.. నిందితులు పట్టుబడ్డారు.

నిందితుల నుంచి పోలీసులు రెండు కార్లు .. 1లక్షా 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.. దొంగల ముఠాను పట్టుకున్న సిఐ విశ్వేశ్వర్ , సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.. గొర్రెలదొంగలు పట్టుకోవడంతో గొర్రెల పెంపకపు దారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..