లింగనిర్ధారణ కేంద్రాలు, గర్భస్రావాలు చేసిన ఆసుపత్రులపై పోలీసులు ఉక్కుపాదం మోపుఉతున్నారు. ఇందులో భాగంగానే కాసులకు కక్కుర్తిపడి ఆడపిల్లలను కడుపులోనే కడతేర్చుతున్న ముఠాను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. తాజాగా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదనే నిబంధన ఉన్నా.. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఈ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకున్న వారికి అబార్షన్లు సైతం చేయిస్తున్నారు.
ఇటీవల ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు అధికారులు. తాజాగా ప్రభుత్వ అనుమతులు లేకుండా లింగనిర్ధారణ స్కానింగ్ యంత్రాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. వీరి వద్ద నుండి సూమారు 25 లక్షల విలువ చేసే 6 పోర్టబుల్, 12 ఫిక్సిడ్ స్కానింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఏపీకి చెందిన మల్లివుడి అశోక్ కుమార్, తాతపూడి కిరణ్ కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరు అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వివరాలు వెల్లడించారు.
లింగ నిర్ధారణకు పాల్పడుతూ ఈ మధ్యే అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అశోక్ కుమార్, కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొంతమంది డాక్టర్లను ఇప్పటికే జైలుకు పంపించామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. త్వరలో డాక్టర్లు, IMA ప్రతినిధులు, RMPలతోనూ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కేసులు నమోదు, కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..