Telangana: బ్యాంకుల లూటీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. దొంగల ముఠా స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

| Edited By: Balaraju Goud

Dec 07, 2024 | 10:16 AM

రాయపర్తి బ్రాంచ్‌లో 630 మంది బంగారాన్ని తాకట్టు పెట్టారు. అయితే అందులో 495 మందికి చెందిన 19.5 కిలోల బంగారాన్ని చోర్‌గాళ్లు సర్దేశారు.

Telangana: బ్యాంకుల లూటీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. దొంగల ముఠా స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Robbery Gang Arrest
Follow us on

దేశవ్యాప్తంగా బ్యాంకులను టార్గెట్ చేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లాకర్లలోని బంగారం లూటీ చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. వరంగల్ జిల్లా రాయపర్తిలోని SBI బ్రాంచ్‌లో 19 కేజీలకు పైగా బంగారం లూటీ చేసిన ఆ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద దొంగిలించిన బంగారంలో కొంత రికవరీ చేసిన పోలీసులు దోపిడీలకు వాడుతున్న టెక్నాలజీని చూసి షాక్ అయ్యారు. గూగుల్ మ్యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులను గుర్తించి దోచేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు.

నవంబర్ 18వ తేదీన అర్ధరాత్రి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని SBI బ్రాంచ్ లో దోపిడి జరిగింది. గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు, అదే గ్యాస్ కట్టర్లతో లాకర్లను ధ్వంసం చేశారు. అందులోని 19 కేజీల 300 గ్రాముల బంగారం లూటీ చేశారు. వరంగల్ జిల్లా చరిత్రలో ఫస్ట్ టైం ఇంత భారీ దోపిడీ జరిగింది. ఈ హైటెక్ దొంగలు పోలీసులకు సవాలుగా మారారు. వరంగల్ పోలీస్ కమిషనర్ పది ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. ఈ నేపథ్యంలో దోపిడీలకు పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.. మొత్తం ఏడుగురు సభ్యులు ఇందులో పాత్రధారులు. కాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుండి 1 కోటి 80 లక్షల రూపాయల విలువగల రెండు కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు రికవరీ చేశారు.

శుక్రవారం సాయంత్రం ఈ దొంగల ముఠాను మీడియా ముందు హాజరుపరిచిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ ముఠా బ్యాంకు దోపిడీల కోసం వాడుతున్న టెక్నాలజీ గురించి వివరించారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే బ్యాంకులను గుర్తించి రెక్కీ నిర్వహించి దోపిడీలు చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్యాంకుల లూటీకి పాల్పడ్డ ఈ ముఠా, రాయపర్తి బ్యాంకు వద్ద రెక్కీ నిర్వహించి నవంబర్ 18వ తేదీన బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు. మూడు లాకర్లలో ఉన్న బంగారం దోచుకుపోయారని తెలిపారు. 19.300 గ్రాముల బంగారం 13 కోట్ల 61 లక్షల రూపాయల విలువగల బంగారాన్ని దోచేశారు. వారి వెంట తెచ్చుకున్న సంచుల్లో ఆ బంగారాన్ని నింపుకొని అదే కారులో పరారయ్యారు. ఆ నిందితులు వచ్చిన కారులోనే తిరిగి హైదరాబాద్ కు చేరుకుని చోరీ చేసిన సొత్తును ఏడు సమాన వాటాలుగా పంచుకున్నారు. నవంబర్ 19వ తేదీన నిందితులు మూడు బృందాలుగా విడిపోయి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కి వెళ్ళిపోయారు.

జిల్లా చరిత్రలోనే భారీ చోరీ జరగడంతో అప్రమత్తమైన పోలీసులు, 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. చివరికి టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ దొంగలను పట్టుకున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హర్షద్ అన్సారి, షాబీర్ ఖాన్, హిమాన్షు బీగం చంద్ జాన్వర్ అనే ముగ్గురిని చాకచక్యంగా పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నవారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ నవాబ్ హసన్ తోపాటు, అక్షయ్ గజానన్ అంబోర్, సాగర్ భాస్కర్ ఘోర్, సాజీద్ ఖాన్ ఉన్నారు. ఈ ముఠా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

అయితే వీరంతా వ్యాపారం పేరుతో హైదారాబాద్‌లో ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారికి దారి చూపడం కోసం గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించుకుని దర్జాగా దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించి పోలీసులు షాక్ అయ్యారు. ఆ దొంగలు వాడిని టెక్నాలజీనే ఉపయోగించి వారిని పట్టుకోగలిగారు. రాయపర్తిలో దోపిడీ చేసిన దొంగలు హైదరాబాద్ వైపు ఆ వాహనం లో వెళ్లినట్లు గుర్తించారు. టోల్‌గేట్ సీసీ కెమెరాలు ద్వారా హైదారాబాద్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆ సమయంలో అక్కడ ఆన్ చేసిన సెల్ ఫోన్ నెట్‌వర్క్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రస్తుతం యూపీకి చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర చెందిన ముఠా పరారీలో ఉంది. వారి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..