తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం పడిగాపులు..

ఆదిలాబాద్‎లోని గోండు గూడాలు జలమో‌రామచంద్రా అంటున్నాయి. ఎండకాలం ఇలా ప్రారంభమైందో లేదో అలా భూగర్బజలాలు అడుగంటడంతో తాగునీటి కోసం అరిగోసలు పడుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‎లోని ఏ గూడాన్నీ చూసినా ఏ మారుమూల గిరిజన పల్లెను పలకరించినా నీటి కష్టాలే వినిపిస్తున్నాయి. గిరిగూడాల్లో తెల్లవారి నుండే మోటాబావుల వద్ద క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి.

తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం పడిగాపులు..
Adilabad District

Edited By: Srikar T

Updated on: Mar 22, 2024 | 9:57 AM

ఆదిలాబాద్‎లోని గోండు గూడాలు జలమో‌రామచంద్రా అంటున్నాయి. ఎండకాలం ఇలా ప్రారంభమైందో లేదో అలా భూగర్బజలాలు అడుగంటడంతో తాగునీటి కోసం అరిగోసలు పడుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‎లోని ఏ గూడాన్నీ చూసినా ఏ మారుమూల గిరిజన పల్లెను పలకరించినా నీటి కష్టాలే వినిపిస్తున్నాయి. గిరిగూడాల్లో తెల్లవారి నుండే మోటాబావుల వద్ద క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. మిషన్ భగీరథ పైప్‎లైన్ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యంతో‌ వారానికి ఒక్క రోజు మాత్రమే వస్తున్న తాగునీటితో తిప్పలు తప్పడం లేదు. ఊర్లో బోర్లున్నా వేసవి తాపానికి భూగర్బ జలాలు అడుగంటడంతో చేతబావులే దిక్కవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో మా పరిస్థితి ఏంటని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు గిరిపుత్రులు. చుట్టూ వాగులున్నా చుక్కనీరు‌ కనిపించకపోవడంతో ఈ ఏడాది కరువు‌కోరల్లో చిక్కుకుంటామేమోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భానుడి భగభగలకు తాగు నీళ్లో రామచంద్రా అంటున్న ఆదిలాబాద్ ఉట్నూర్ ఏజేన్సీపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్.

ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిందెడు నీటి కోసం బావుల వద్ద బారులు తీరిన జనమే కనిపిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే భూగర్బ జలాలు‌ అడుగంటిపోవడంతో బిందెడు నీటి కోసం రెండుమూడు కిలోమీటర్లు నడిచి వెళ్లక తప్పడం లేదు. ఆదిలాబాద్ – కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాల పరిదిలోని 33 మండలాలకు కొమురంభీం అడా ప్రాజెక్టు నుండి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా అవుతుండగా.. ఉట్నూర్ ఏజేన్సీ పరిధిలోని‌ ఇంద్రవెళ్లి , సిరికొండ మండలాల చివరి గిరి గ్రామాలకు తాగునీటి సరపరా నిలిచిపోవడంతో 72 గ్రామాల గిరిజనులు తీవ్ర నీటి‌ ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంద్రవెళ్లి మండలంలోని సాలెగూడ, దొడంద, చిలాటిగూడ, గట్టెపల్లి, చిత్తగూడ, టేకిడిగూడ, కొలాంగూడ, జెండాగూడ, పొల్లుగూడ, మామిడిగూడ, ఖైరుగూడ, బుర్సన్‌పటార్‌, గోపాల్‌పూర్‌ గ్రామాల్లో నీటిగోస తీవ్రంగా ఉంది. ఈ గ్రామాలకు తలాపునే చిక్మన్ ప్రాజెక్ట్.. 50 కిమీల దూరంలోనే పోచంపాడ్, గోదావరి పరివాహక‌ప్రాంతం ఉన్నా.. అక్కడి‌నుండి మిషన్ భగీరథ తరలింపు చేయకుండా 120 కిమీల దూరంలోని కొమురంభీం జిల్లా అడా ప్రాజెక్ట్ నుండి మంచి నీటి సరఫరా చేస్తుండటం.. మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి‌ వారానికి ఒక్క రోజు మాత్రమే ఈ గూడాలకు సరఫరా అవుతుండటంతో నీటికష్టాలు తప్పడం లేదు. దీంతో చేత బావుల నీటిని తోడుకునే గొంతు తడుపుకుంటున్నారు గిరిజనులు.

ఒక్క ఉట్నూర్ ఏజేన్సీలోనే కాదు పట్టణాల్లోను ఇదే పరిస్థితి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోను డబుల్ బెడ్రూంల‌కు నీటి సరఫరా లేక ట్యాంకర్ల మీద ఆదారపడుతున్నారు జనం. అటు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఐదు మండలాలు, ఆదిలాబాద్‌ జిల్లాలోని మరో ఆరు మండలాల్లోని గిరిజన గ్రామాల్లోను ఇదే పరిస్థితి. కొమురంభీం జిల్లా అడా ప్రాజెక్ట్‌కు సంబంధించి కెరమెరి మండలం ధనోర వద్ద నీటి శుద్ధి ప్లాంట్‌ (డబ్ల్యూటీపీ) ఉండగా.. ఇక్కడ శుద్ధి అయిన నీళ్లు మిషన్‌ భగీరథ ప్రధాన పైపులైన్‌ ద్వారా కొమురంభీం జిల్లా జైనూర్‌ మండలంలోని భూసిమెట్ట, కెరమెరి మండలంలోని కేస్లాగూడకు సరపరా అవుతున్నాయి. అక్కడి నుంచి ఇంట్రా పైపులైన్‌ ద్వారా నీళ్లు చేరాల్సి ఉండగా.. భూసిమెట్ట, కేస్లాగూడకు నీళ్లు చేరవేసే క్రమంలో విద్యుత్‌ సమస్య నిత్యం ఎదురవుతున్నట్లు మిషన్‌ భగీరథ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో 72 గ్రామాలకు నీటిసరఫరాలో సమస్య ఎదురవుతోంది. దీంతో గ్రామాల్లో తాగు నీటి కోసం గిరిజనులు కిలో మీటర్ల వరకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, నార్నూర్‌, గాదిగూడ, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లోని గిరిజన గ్రామాలు కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లోని గిరిజన గ్రామాలు తాగునీటి తిప్పలతో అల్లాడిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఉట్నూర్ ఏజెన్సీలోని గిరిజన గూడాలు వేసవి ప్రారంభంలోనే ఇలా దాహం.. దాహం అంటూ తల్లడిల్లిపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న చేతిపంపుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు మిషన్‌ భగీరథ నీటి సరఫరా సరిగా జరగకపోవడంతో పరిస్థితి ఇలా తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రధానంగా కొమురంభీం అడా ప్రాజెక్ట్‌ నీటి వనరుగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. పక్కనే కడెం ప్రాజెక్ట్ సైతం అడుగంటిపోవడంతో అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కవ్వాల్ అభయారణ్య పరిదిలోని మారుమూల గిరిజన గూడాలైతే రోజూ నీటికోసం కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి బావులు, చెలిమెల వద్ద బారులు తీరి నీటిని తోడుకుంటున్నారు. వేసవి ప్రారంభమై రెండు వారాలు గడవుక ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు గిరిజనులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…