
Hyderabad Libration Day: రజాకర్ల పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన ఘన నివాళి అర్పించారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం కబంధహస్తాల్లోనే చిక్కుకుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన పోలీస్ చర్య వల్ల ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. వివాదాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం తరువాత 500 పైగా రాచరిక రాష్ట్రాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని కొనియాడారు.
సర్థార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానీయుడికి ప్రతి ఒక్కరూ నివాళులర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ తో పాటు బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ, తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా టీఆర్ ఎస్, తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..