Telangana: రాత్రి పూట పందుల షెడ్డు వద్దకు వచ్చారు – ఏం చేస్తున్నారా అని సీసీ ఫుటేజ్ చూడగా

వనపర్తి జిల్లా ఆత్మకూరులో పందుల షెడ్డు వద్ద అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది. 53 పందుల్లో 23ను ఎత్తుకెళ్లిన దుండగులు పందుల యజమానులపై ఖాళీ సీసాలతో దాడి చేసి పారిపోయారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Telangana: రాత్రి పూట పందుల షెడ్డు వద్దకు వచ్చారు - ఏం చేస్తున్నారా అని సీసీ ఫుటేజ్ చూడగా
Pigs Theft

Edited By: Ram Naramaneni

Updated on: Jul 22, 2025 | 7:37 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలోని పరశురామ్ పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుమారు 53 పందులతో పరమేశ్వర స్వామి చెరువు కట్ట బ్రిడ్జి కింద షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆదివారం అర్ధరాత్రి సమయంలో చెరువు కట్ట బ్రిడ్జిపై ఎవరో సంచరిస్తున్నట్లు షెడ్డు వద్ద ఉన్న సీసీ కెమెరాలలో గమనించాడు పరశురామ్. విషయాన్ని సొదరుడు చెన్నయ్య, బంధువులతో చెప్పాడు. హుటాహుటిన ముగ్గురు కలిసి పందుల షెడ్డు వద్దకు బయలుదేరి వెళ్లారు. అక్కడ షెడ్డులోని పందులను బొలెరో వాహనంలో ఎక్కిస్తుండడం చూసి గట్టిగా కేకలు వేశారు. ఇంతలోనే పరశురామ్ బృందాన్ని గమనించిన దొంగలు వెంటనే అక్కడి నుంచి వాహనంతో పాటు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని ముగ్గురు కలిసి అడ్డగించారు. బొలెరో వాహనంలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా పరశురామ్ బృందంపై ఖాళీ కూల్ డ్రింక్ సీసాలతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

అయితే దొంగలను పరశురామ్, చెన్నయ్యలు అలాగే వెంబడించారు. బొలెరో వాహనం పిన్నంచర్ల, అల్లిపూర్ గ్రామాల మీదుగా మదనాపూర్ రైల్వే గేటు వైపు వెళ్లింది. అక్కడ రైల్వే గేటు పడటంతో వాహనాన్ని నిలిపారు దుండగులు. రైలు వెళ్లే వరకు ఉండి గేటు తీయగానే జారుకుందామని భావించారు. అయితే దొంగల వాహనాన్ని వెంబడించుకుంటూ వచ్చిన పరశురామ్ బృందం మరోసారి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఖాళీ సీసాలతో మళ్లీ దాడి చేసి పరారయ్యారు. అక్కడి నుంచి సీసీ కుంట వైపు దుండగులు వెళ్లడాన్ని గమనించిన పరశురామ్… సీసీ కుంటలో ఉండే బంధువులకు సమాచారం అందించాడు. వెంటనే వారు రోడ్డుకు అడ్డంగా కారు, పలు వాహనాలను అడ్డుగా పెట్టి దుండగుల కోసం వేచి చూస్తున్నారు. కొద్దిసేపటికి దూరం నుంచే విషయాన్ని గమనించిన దొంగల బ్యాచ్ వేగంగా రోడ్డుకు అడ్డుగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయారు. అక్కడి నుంచి కురుముర్తి ఆలయం ప్రధాన రహదారి మీదుగా పారిపోయారు. దీంతో బాధితులు పరశురామ్ బృందం వెనుతిరిగి ఆత్మకూరులోని షెడ్డు వద్దకు చేరుకున్నాడు. అక్కడ మొత్తం పరిశీలించగా తనకు ఉన్న 53పందుల్లో 23 పందులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. దొంగిలించిన పందుల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని బాధితుడు పరశురామ్ తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దుండగుల సీసాల దాడిలో పరుశురాం, సోదరుడు, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. కాళ్లకు సీసా పెంకులు గుచ్చుకోవడంతో రక్తస్రావం అయ్యింది. అదే రాత్రి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే గతంలోనూ తన పందులను ఇదే విధంగా దొంగతనానికి గురయ్యాయని బాధితుడు పరశురామ్ వాపోయాడు. జీవనాధారంగా పెంచుతున్న పందులను ఎత్తుకెళ్లడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.