
విశాల భవనం.. ప్రాంగణంలో తుమ్మచెట్లు.. నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ ప్రాంతం అలంపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాలవాంఛ అయిన 100 పడకల ఆసుపత్రి. ఆపద సమయంలో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే చోటు.. మరెంతో మంది చిన్నారులకు ఊపిరి పోసే ప్రాంతం. నిర్మాణం పూర్తి చేసుకొని.. ప్రారంభం సైతం చేశారు.. కానీ వైద్యం అందించేందుకు సిబ్బంది మాత్రం లేరు. దీంతో ఏడాదిన్నర కాలంగా కట్టిన బిల్డింగ్ కట్టినట్టే ఉంది.. తెచ్చిన వైద్య పరికరాలు వృథాగా ఉండిపోయాయి ఉన్నాయి.
అలంపూర్ చౌరస్తాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.21 కోట్ల నిధులతో ఈ వంద పడకల ఆస్పత్రిని నిర్మించారు. కావాల్సిన వైద్య సదుపాయాలు, సామాగ్రితో 2023 ఆక్టోబర్ 5న లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిన్నర గడుస్తున్నా నేటికి వైద్యులు, సిబ్బంది కేటాయింపు జరగలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందవచ్చనుకున్న అలంపూర్ నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. సిబ్బంది కేటాయింపులో జాప్యం కారణంగా అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది అలంపూర్ ప్రజల పరిస్థితి.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో అలంపూర్, చుట్టూ పరిసర గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వైద్య సేవల కోసం ఏపీలోని కర్నూల్ నగరంపైనే ఆధారపడేవారు. అక్కడ ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు అస్పత్రుల్లో చికిత్స పొందేవారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిన రోగులకు ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అమలు కావడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వ వైద్యులు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఖర్చుపెట్టుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలి… లేదంటే 50కిలోమీటర్లు ప్రయాణించి గద్వాల్ ఆసుప్రతికి వెళ్లాలి. అయితే అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించాల్సిన సమయంలో ఇబ్బందులు ఎదరవుతున్నాయి.
జాతీయ రహదారి – 44పై ఏ ప్రమాదం జరిగిన కర్నూల్ అస్పత్రిపైనే ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంగా వైద్య సేవలు ఆలస్యంతో పలువురు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు సైతం ఉన్నాయి. ఈ ఆస్పత్రి ప్రారంభం అయ్యాక వైద్య సేవలకు అవసరమైన సామాగ్రి, సదుపాయాలు ఏర్పాటు చేశారు. 100 పడకల్లో సామాగ్రి, ఆక్సిజన్ పరికరాలు, సెలైన్ బాటిల్ స్టాండ్స్, వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాలు అన్ని వచ్చేశాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, జనరల్, మెటర్నరీ వార్డులు సకల సదుపాయాలు కల్పించారు. నెలలు గడుస్తున్నా వైద్యులు, సిబ్బంది కేటాయింపులు లేక విలువైన వైద్య సామాగ్రి దుమ్ము పట్టిపోతున్నాయి. కొన్ని పరికరాలు, సామాగ్రి చోరికి గురైంది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే భవనం బూతు బంగ్లాలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వందపడకల ఆస్పత్రి అందుబాటులోకి తేవాలంటే వీలైనంత త్వరగా వైద్యులు, నర్సులు, పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషీయన్లు, ఇతర సిబ్బందిని కేటాయించాల్సి ఉంది. సుమారు 100నుంచి 120మంది అన్ని రకాల సిబ్బంది అవసరమవుతారు. అయితే ఆస్పత్రికి వైద్యులు, సిబ్బంది కేటాయింపునకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు వాటి ఊసే లేదు. ఏకంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించి అస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
వందపడకల ఆసుపత్రిలో వైద్యం అలంపూర్ ప్రజలకు కలగానే మిగిలిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన నేపథ్యంలో ఆ పార్టీకి మంచి పేరు వస్తుందని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం సిబ్బందిని కేటాయిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందే అవకాశముందని రాజకీయాలకు తావులేకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా వైద్య సేవలు ప్రారంభించాలని అలంపూర్ వాసులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.