AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర.. రాహుల్, రేవంత్‌కు ఆ హక్కే లేదన్న కిషన్ రెడ్డి..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం పక్కనపెట్టి.. ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం విద్యార్థులను అడ్డుపెట్టుకుని షాహీన్ బాగ్ తరహా కుట్రలకు తెరలేపుతున్నాయని మండిపడ్డారు. అసలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు కేంద్రాన్ని రాజీనామా అడిగే నైతిక హక్కు ఉందా అని నిలదీశారు.

Kishan Reddy: విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర.. రాహుల్, రేవంత్‌కు ఆ హక్కే లేదన్న కిషన్ రెడ్డి..
Kishan Reddy Slams Opposition Over Neet Paper Leak
Krishna S
|

Updated on: Jul 23, 2026 | 7:24 PM

Share

దేశంలో గత రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎంతో దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిరసనల వెనుక పూర్తిగా రాజకీయ స్వార్థం దాగి ఉందన్న ఆయన.. షాహీన్ బాగ్‌లో లాగానే దేశ వ్యతిరేక శక్తులు విద్యార్థులను అడ్డుపెట్టుకుని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ బయటపడగానే కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో పాత్ర ఉన్న 17 మంది నిందితులను సిబిఐ అరెస్ట్ చేసి జైలుకు పంపిందని తెలిపారు. పారదర్శకత కోసం మిలిటరీ విమానాల ద్వారా ప్రశ్నాపత్రాలను సురక్షితంగా తరలించి, నీట్ రీ ఎగ్జామ్‌ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు అధ్యాపకుల స్వార్థం, అవినీతికి ఆశపడి నమ్మకాన్ని ఒమ్ము చేశారని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టపరమైన నిబంధనలను, సవరణలను తీసుకువచ్చిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, రాహుల్, రేవంత్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు..

విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి.. కాంగ్రెస్, లెఫ్ట్ పక్షాలు విద్యార్థులను తమ రాజకీయ మనుగడ కోసం వాడుకుంటున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘తమ పాలనలో పదుల సంఖ్యలో పేపర్ లీక్‌లు జరిగినప్పుడు కనీసం స్పందించని వారు, ఏనాడూ రాజీనామా చేయని వారు.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని రాజీనామా అడగడం విడ్డూరంగా ఉంది. రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి ఆ నైతిక హక్కు లేదు’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రేవంత్ ఎందుకు రాజీనామా చేయలేదు..

తెలంగాణలో 2025లో టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. 2026లో జగ్గిత్యాలలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బి.ఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్ నాయకులు తమ సొంత మంత్రుల రాజీనామాలు కోరారా అని నిలదీశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2024 నాటికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్, ముందుగా తెలంగాణ యూత్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్, కోదండరామ్‌లకు ప్రశ్న..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎన్నిసార్లు లీక్ అయ్యాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ నాయకులంతా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఇన్నాళ్లూ ఉద్యోగ క్యాలెండర్, ఖాళీల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు బీజేపీపై విమర్శలు చేయడం వెనుక అంతర్యం ఏంటని నిలదీశారు.

పరిశోధనలు, సంస్కరణలపై కేంద్రం దృష్టి

జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్ణాల్లో కొన్ని అసాంఘిక, తుక్డే తుక్డే శక్తులు ప్రవేశించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, పోలీసులపై దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, పెట్టుబడులను ఆకర్షించడం, జాతీయ విద్యా విధానం ద్వారా మెడికల్ సీట్లను భారీగా పెంచడం వంటి ఎన్నో సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం వేగవంతం చేసిందన్నారు. విపక్షాలు అనవసర రాజకీయాలు పక్కనపెట్టి, పార్లమెంట్‌లో జరిగే సమగ్ర చర్చలో పాల్గొని విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Follow Us