
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ములుగు బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరతారని కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడం బీఆర్ఎస్‌కు చేతకాక వివాదంగా మారుస్తోందన్నారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. గిరిజనులను మోసం చేయడం ఆ పార్టీ లక్షణం అంటూ విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయండని ప్రజలను కోరారు. తెలంగాణలో మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. పార్లమెంటులో అత్యధికంగా గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారేనని తమకు గిరిజనుల పట్ల ఉన్న ఆదరణను వివరించారు.
ఆ తరువాత భువనగిరిలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు అమిత్ షా. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్‌ను గ్యారేజీకి పంపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వేలకోట్ల భూములను దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ అబద్దాలు, మోసపూరిత మాటలు చెప్తున్నారంటూ విమర్శించారు. బీఆర్ఎస్‌కు వీఆర్‌ఎస్ ఇచ్చే రోజు వస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌ను అధికారం నుంచి దించేందుకు మీరంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆచార్య వినోబాభావే భూధానోద్యమం ప్రారంభిస్తే కేసీఆర్ మాత్రం భూమి కబ్జా చేసే ఉద్యమాన్ని ప్రారంభించారని తీవ్రంగా విమర్శించారు. 2018 లో కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని అందుకే తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే.. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మరో సారి ప్రచార వేదికగా ప్రజలకు వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..