Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

|

Dec 07, 2024 | 9:19 AM

కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ప్రధానితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు కిషన్‌ రెడ్డి.

Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్
Kendriya Vidyalaya Students
Follow us on

దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. వీటి ద్వారా ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందనుందన్నారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన ఏడు నవోదయ విద్యాలయాలు జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు రూ. 8,232 కోట్లు కేటాయించారు.

తెలంగాణలో కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని.. యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణలో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దాదాపు రూ.340 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ 7 JNVల ద్వారా మరో 4,000 మంది తెలంగాణ విద్యార్థులకు 6 నుండి 12వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందనుందని, 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందన్నారు. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు కిషన్‌ రెడ్డి.