Warangal: ఒకే సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్ సరఫరా.. ఎంజీఎం ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్

ఒకే సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్ సరఫరా ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది.. వరంగల్‌ MGM ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు వేయడంతోపాటు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులు, సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.

Warangal: ఒకే సిలిండర్‌తో ఇద్దరు చిన్నారులకు ఆక్సిజన్ సరఫరా.. ఎంజీఎం ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్
Mgm

Updated on: Oct 26, 2025 | 8:42 AM

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల సేవల పట్ల ఓ కేర్‌ టేకర్‌ నిర్లక్ష్యం వహించాడు. ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న 12మంది చిన్నారులకు రోగనిర్ధరణ పరీక్షల్లో భాగంగా వైద్యులు ఎక్స్‌రే తీయించాలని కేర్‌ టేకర్‌కు సూచించారు. ఎక్స్‌రే విభాగానికి 12 మంది పిల్లలను తీసుకెళ్లే సమయంలో నలుగురు చిన్నారులకు ఆక్సిజన్ అవసరమై సిలిండర్‌తో తీసుకెళ్లారు. ఎక్స్‌రే పరీక్షల తర్వాత ఆక్సిజన్ సిలిండర్‌తో పిల్లలను వార్డుకు తీసుకెళ్లాల్సిన కేర్ టేకర్‌ సిబ్బంది తన విధులను మరచి.. మీరే తీసుకెళ్లండి అంటూ పిల్లల తల్లిదండ్రులను పంపించారు. ఎక్స్‌రే విభాగం నుంచి పిల్లల విభాగానికి మధ్య దారి గుంతలతో నీరు నిలిచి ఉంది. అలాంటి దారిలో ఇద్దరు పిల్లలకు కలిపి ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకెళ్లడం చిన్నారుల తల్లిదండ్రులకు తెలియకపోవడంతో సిలిండర్ మూత ఊడిపడి ఆక్సిజన్ లీక్‌ అయింది.

దీంతో.. వారు ఆందోళన చెందారు. అక్కడే ఉన్న కొందరు రోగులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మరో కేర్ టేకర్‌ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్ లీకేజీని అరికట్టారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్ MGM హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌పై వేటు వేశారు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, వార్డు సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు. దీంతోపాటు.. MGM పరిస్థితులపై సమీక్ష చేయాలని.. సిబ్బంది పనితీరుపైనా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని మంత్రి దామోదర రాజనర్సింహ.. డీఎంఈని కోరారు.

మొత్తంగా.. వరంగల్ MGM ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది చిన్నారులను తరలించాల్సి ఉన్నా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. MGM ఆస్పత్రిలో గతంలోనూ అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..