Lightning Strike: పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దుమ్ముగూడెం మండలం పరిధిలోని ఆంధ్రకేసరి నగర్ కాలనీ శివారులో బుధవారం పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. ఆంధ్రకేసరి నగర్ కాలనీకి చెందిన చాట్ల వీర్రాజు (45), శ్రీనగర్ కాలనీ గ్రామానికి చెందిన జుంజూరి భాస్కరరావు (50) దోమలవాగు సమీపంలో పశువులను మేపడానికి వెళ్లారు. అయితే సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వాగు పక్కనే వీరిద్దరితో పాటు మరి కొంత మంది వర్షంలో తడుస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు వీరి పక్కనే పిడుగు పడింది.
దీంతో ఒక్కసారిగా వీర్రాజు, భాస్కరరావు పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్న వీరిని స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిరుపేద కుటుంబాలు కావడంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వీరి గ్రామాలు పక్కపక్కనే ఉండటంతో చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో వీరి మృతదేహాలను చూసేందుకు తరలి వచ్చారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.