
ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామ శివారులో జరిగింది. కొందరు రైతులు రోడ్డుపై సగభాగం మొత్తం వరి ధాన్యం ఆరపోశారు. ఎదురుగా వస్తున్న వాహనాలు క్రాసింగ్ చేసే పరిస్థితి కూడా లేకుండా ధాన్యం ఆరబోశారు. ఈ మార్గంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు రైతులు వరి కుప్పలు తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న DCM వాహనం ఢీకొని మృతి చెందారు. మృతులలో ఒకరు ఇదే మండలంలోని ఉడుతగూడెం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డిగా గుర్తించారు. మరొకరు ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన చిన్నయాకూబ్‌గా గుర్తించారు. వీరిద్దరి వయసు 60 ఏళ్లకు పైగానే ఉంటుంది. చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు. వ్యక్తిగత పనిమీద ద్విచక్ర వాహనంపై పెద్దపెండ్యాలకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రాణ స్నేహితులు ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరణంలోని వీడని వీరిస్నేహం ఊరంతా బోరుమనేలా చేసింది. రెండు గ్రామాలలో విషాద వాతావరణం అలముకుంది. రోడ్లపై నిర్లక్ష్యంగా ఆరబోసిన ధాన్యమే ఇంతటి విషాదానికి కారణమని వాహనదారులు, మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యంగా రహదారిపై ధాన్యం ఆరపోసి, వాటి వద్ద బండరాళ్లు పెడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా చాలా సందర్భాలలో వరికుప్పలు గమనించకుండా కార్లు, బైక్స్ కూడా వాటిపై ఎక్కి ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ రైతులు నిర్లక్ష్యం వీడడం లేదు. పోలీసులు హెచ్చరించినా మార్పులేదు. ఇప్పటికైనా మరో ప్రమాదం జరగకుండా మరోప్రాణం బలవకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వాహనదారులు కోరుతున్నారు.