‘దేవుడు కలలోకి వచ్చి.. ఇక్కడ ఆలయం కట్టమన్నాడు..’ ఇద్దరు భక్తుల కోరిక.. కట్ చేస్తే.!
భక్తుల పూనకాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతవరణం వేడెక్కింది. 'అమ్మపలుకు.. జగదంబ పలుకు..' మాట వినకపోతే కష్టకాలం కొనితెచ్చుకున్నట్టే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోండంటూ పూనకాలతో ఊగిపోతూ ఆ ఇద్దరు భక్తులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
నిర్మల్ జిల్లా, జనవరి 27: భక్తుల పూనకాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతవరణం వేడెక్కింది. ‘అమ్మపలుకు.. జగదంబ పలుకు..’ మాట వినకపోతే కష్టకాలం కొనితెచ్చుకున్నట్టే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోండంటూ పూనకాలతో ఊగిపోతూ ఆ ఇద్దరు భక్తులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అంతే అమ్మ ఆలయం నిర్మించి తీరాల్సిందే అంటూ భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనకు దిగారు. ముళ్ల కంచెలు రోడ్డుకు అడ్డంగా వేసి రోడ్డు దిగ్బందం చేశారు. అధికారులు వచ్చి ఆలయం నిర్మిస్తామంటూ హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ తెగేసి తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళనకు ఎండ్ కార్డు పడింది. పోచమ్మ ఆలయం కోసం పూనకాలతో సాగిన ఆందోళన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ నుంచి శాంతినగర్ వెళ్లే దారిలో వెలిసిన పురాతన పోచమ్మ ఆలయాన్ని పునర్ నిర్మించాలని కాలనీవాసులు నిరసనకు దిగారు. ఇద్దరు మహిళా భక్తులకు పూనకాలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గత పాలకులు పోచమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చి అమ్మనే మోసం చేశారంటూ పూనకాలతో ఊగిపోతూ నిరసన తెలపడంతో స్థానికులు అమ్మ.. శాంతించంటూ పూజలు చేశారు. అమ్మ శాంతించాలంటే వెంటనే ఆలయం నిర్మించాలని శిశసత్తులు తెలపడంతో స్థానికులు నిరసన బాట పట్టారు. అమ్మవారి ఆలయ భూములను కొందరు కబ్జా చేశారని, వెంటనే పోచమ్మ ఆలయ భూములను కబ్జా నుంచి విడిపించి.. ఆలయాన్ని ఘనంగా నిర్మించాలని శిశసత్తులు తెలపడంతో.. కాలనీవాసులు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు.
రహదారిపై రాళ్లు, ముళ్ళకంపలు పెట్టి నిరసన తెలపడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. రాకపోకలు నిలిచిపోవడంతో పాటు మరో వర్గం అభ్యంతరం తెలపడటంతో ఆందోళన తారస్థాయికి చేరింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు భక్తులకు నచ్చచెప్పడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ.. ఆలయ భూమిని కబ్జా చేశారని గతంలో సైతం ఆందోళనలు చేపట్టడం జరిగిందని.. భూమి యజమాని ఈ స్థలాన్ని ఆలయానికే ఇస్తామని చెప్పడంతో అప్పుడు ఆందోళన విరమించినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఆలయ భూమి తిరిగి ఇవ్వకపోగా.. ఆలయ పునర్ నిర్మాణానికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఆలయాన్ని నిర్మించే వరకు తాము ఆందోళనలు విరమించేది లేదని హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..