Rangareddy: రైతు భీమా, రైతు బంధు పథకాల పేరిట రెండు కోట్లు మోసం
ఓ వ్యవసాయ అధికారి తప్పుడుదారిలో పయనించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంకు ఖాతాలు తెరిచి.. అందినకాడికి దోచుకొని ఆస్తిని కూడబెట్టుకున్నాడు. నకిలీ పాత్రల భాగోతం బయటపడటంతో చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు వ్యవసాయాధికారి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో చోటుచేసుకుంది.

ఓ వ్యవసాయ అధికారి తప్పుడుదారిలో పయనించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, బ్యాంకు ఖాతాలు తెరిచి.. అందినకాడికి దోచుకొని ఆస్తిని కూడబెట్టుకున్నాడు. నకిలీ పాత్రల భాగోతం బయటపడటంతో చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు వ్యవసాయాధికారి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో చోటుచేసుకుంది. తెలంగాణాలో గొర్రెల పంపిణీ స్కామ్ మరువక ముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతు బీమా, రైతుబంధు పథకాల పేరిట వ్యవసాయ శాఖలో ఏఈవో 2 కోట్లు కొట్టేశారు. బతికున్న రైతులను చంపేసి, వారి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా పథకం కింద కోటి రూపాయలు, రైతుబంధుకు చెందిన మరో కోటిని కాజేశారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందుర్గ్ ఏఈవో గోరెటి శ్రీశైలం, అతనికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరస్వామిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈకేసు వెనక ఎవరెవరున్నారనే కోణంలో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైతన్నలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరణించిన రైతులకు రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు , రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా 10వేల రూపాయల చొప్పున సాయం చేసింది. ఈ పథకంలోని లొసుగులను అవకాశంగా మార్చుకున్న రంగారెడ్డి జిల్లా కొందర్గు ఏఈవో గోరెటి శ్రీశైలం కుంభకోణానికి తెరలేపారు. కొందుర్గ్ ప్రాంత పరిధిలోని కొందరు అన్నదాతల వివరాలు సేకరించిన అధికారులు వారు మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి మేర పరిహారం నిధులు స్వాహా చేసినట్లు దర్యాప్తులో తేలింది.
కొందుర్గ్ కు చెందిన 20 మంది బతికున్న రైతులను చంపేసి, 2019 సంవత్సరం నుండి ఇప్పటివరకు అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలిసుల దర్యాప్తులో వెల్లడైంది. రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. అయితే ఆ క్లెయిమ్‌ల చెల్లింపులకు సంబంధించి ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ఆ విషయంపై ముంబయిలోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసునమోదు చేసుకున్న సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసారు.
అయితే రైతు బీమా కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రైతుబంధు కింద కోటి రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు పోలిసుల దృష్టికి వెలుగులోకి వచ్చింది. 130 నకిలీ ప ట్టాదారు ( నాన్ క్లైమంట్స్) రైతుల పేరిట నకిలీ ఖాతాలు తెరవడం, దొడ్డి దారిలో నిధులు కాజేసి జేబులో వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రైతుబంధు సాయం అందాలంటే భూ యజమాని పేరు ధరణిలో నమోదై ఉండటం సహా బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానమై ఉండాలి. అంతా పక్కాగా ఉన్నా నిధులు ఎలా మళ్లించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
