
మావోయిస్టు ఉద్యమం నుంచి బయటికొచ్చిన చంద్రన్న తన జీవితంలోని ఎన్నో అనుభవాలను, తన ఆలోచనలను, భవిష్యత్ ప్రణాళికలను TV9 తో ప్రత్యేకంగా పంచుకున్నారు. మావోయిస్టు పార్టీకి ఇప్పటికీ ప్రజల్లో బలమైన ఆధారం ఉందని చంద్రన్న స్పష్టం చేశారు. “మావోయిస్టు సిద్ధాంతం నాలో ఇంకా సజీవంగానే ఉంది. ప్రజల కోసం పోరాటమే మా ధ్యేయం,” అన్నారు. అయితే తాను సోను లాంటి నాయకులతో విభేదిస్తున్నానని చెప్పారు. “సోనుతో నా విభేదాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయుధాలు పట్టుకుని మూకుమ్మడిగా లొంగిపోవడాన్ని నేను సమర్థించను,” అని ఆయన అన్నారు.
‘ఆపరేషన్ కగార్’ గురించి మాట్లాడుతూ చంద్రన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కగార్ వల్ల మావోయిస్టు పార్టీకి కొంత నష్టం జరిగినా, దాంతో పూర్తిగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడం అసాధ్యం. ఆ ఉద్యమం మూలాలు ప్రజల మధ్యలోనే ఉన్నాయి,” అన్నారు. “హిడ్మా లాంటి నేతలు కూడా శాంతి చర్చలకు వ్యతిరేకం కారు. సరైన పద్ధతిలో ప్రభుత్వం ముందుకొస్తే మేము కూడా చర్చలకు సిద్ధమే,” అని వెల్లడించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై చంద్రన్న స్పందిస్తూ, “వచ్చే ఆరు నెలల్లో ఒక్క మావోయిస్టు కూడా మిగలనని చెప్పడం సాధ్యం కాని మాట. ఆలోచనలను బుల్లెట్లతో చంపలేరు. ప్రజల మనసుల్లో మావోయిస్టు సిద్ధాంతం ఉందంతవరకు ఉద్యమం నిలుస్తుంది,” అన్నారు.
తన భవిష్యత్ గురించి మాట్లాడుతూ చంద్రన్న, “నేను ప్రజల మధ్యనే ఉంటాను. వారికి ఉపయోగపడే విధంగా పనిచేస్తాను. కానీ నేను ఏ రాజకీయ పార్టీలో చేరను,” అని స్పష్టం చేశారు. రాజకీయాలపై తన అభిప్రాయం వెల్లడిస్తూ, “కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో కుటుంబ పాలన తప్ప ఏం చేయలేదు. ఆయన ‘మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం’ అన్న మాటలు కేవలం ప్రచార నాటకమే అయ్యాయి,” అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతూ, “ప్రస్తుతం సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే మావోయిస్టులను రేవంత్ సోదరులతో పోల్చారు అని పేర్కొన్నారు. పార్టీలో చీలికలు ఉండొచ్చు కానీ మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడం ఎవరి తరమూ కాదు. కొంతమంది నమ్మకద్రోహులు ఉన్నా ఉద్యమానికి ప్రజల మద్దతు ఉంది,” అని అన్నారు.బసవరాజు ఎన్కౌంటర్‌లో కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. అదే విధంగా కర్రెగుట్టల ఎటాక్ కూడా ఒక కోవర్ట్ ఆపరేషన్‌గానే జరిగింది,” అని వివరించారు.
2024లో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం గురించి చంద్రన్న వెల్లడించారు. “ఆ సమావేశంలో ఆయుధాలు వీడాలా అనే అంశంపై చర్చ జరిగింది. గణపతి, తిప్పిరి తిరుపతి, బసవరాజు, సోను – నలుగురూ చర్చిద్దాం అనుకున్నారు. కానీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. బసవరాజు నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం తప్పు,” అన్నారు. త్వరలో సెక్రటరీగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని నియమించబోతున్నారని తెలిపారు.
చివరిగా బస్తర్ ప్రాంతంలోని పరిస్థితులపై చంద్రన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పాలక వర్గాలు బస్తర్ ప్రాంతాన్ని ఎప్పుడూ అభివృద్ధి చేయలేదు. మేము మావోయిస్టు పార్టీ కట్టించిన పాఠశాలలను కూడా ధ్వంసం చేశారు. ప్రజల కోసం మేము చేసిన సేవలకే ప్రతిఫలంగా మమ్మల్ని శత్రువులుగా చిత్రీకరించారు,.. మేము ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటాం. వారికి ఉపయోగపడే మార్గంలోనే ముందుకు సాగుతాం.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.