ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి వెలుగులోకి వస్తుండడంతో స్మగ్లర్లపై డేగ కన్నేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లో మరోసారి గంజాయి గుప్పుమంది. భాగ్యనగరం నడిబొడ్డులోని ధూల్‌పేట్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి అడ్డా ధూల్‌పేటలో టీవీ9, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ధూల్‌పేటలోని ఓ గల్లీలో అక్రమంగా దాచిని గంజాయిని భారీగా స్వాధీనం చేసుకున్నారు. సినీ ఫక్కీలో సరుకును దాచిన గంజాయిగాళ్ల అసలు దుకాణాన్ని బట్టబయలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇందుకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీవీ9, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ విస్తృత తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. వాషింగ్ మిషన్‌లో, ఇంట్లోని షెల్ఫ్‌ల్లో, పూల కుండీల్లో, వాటర్ సంప్‌లో, చివరకు కారు బంపర్‌లో దాచిన గంజాయి బయపడింది. ఖాకీల కంటపడకుండా ఖతర్నాక్ సెటప్ చేసుకోవడమే కాదు, పోలీసులొస్తే ఉసిగొల్పేందుకు కుక్కులను పెంచుతున్నారు. అయితే, జాయింట్ ఆపరేషన్‌తో డామిట్ గాళ్ల కథ అడ్డం తిరిగింది. చెక్ చేస్తే ఆల్ టుగెదర్‌గా 20 కేజీల గంజాయి పట్టుబడింది.
అస్సాం – ఆంధ్ర బార్డర్ నుంచి సరుకుని దిగుమతి చేసుకుంటోంది గంజాయి మాఫియా. కాలేజీ స్టూడెంట్స్, యువతను టార్గెట్ చేసి దందా చేస్తున్నట్టు దర్యప్తులో తేలింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌అధికారులు ఖురేషి, సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో గంజాయి డెన్స్‌పై రెయిడ్స్ నిర్వహించారు.
వాస్తవానికి.. తెలంగాణ పోలీసులు గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ముప్పేట దాడులు చేస్తుండడంతో హైదరాబాద్ పోలీసుల వ్యూహాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రధానంగా.. ఏపీ పోలీసుల సహకారంతో గంజాయికి అడ్డుకట్టవేసేందుకు దాడులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చెక్‌పోస్టులు దాటి ఒడిశా నుంచి హైదరాబాద్ దాకా ఈ గంజాయి వచ్చిందనే అంశంపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..